
ఒకప్పుడు చాలా మందికి నల్లని, ఒత్తైన జుట్టు ఉండేది. ఇప్పుడు పల్చని, సన్నని, బట్టతలలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా ఈ రోజుల్లో ఒత్తైన జుట్టు ఉండటం గగమైపోయింది కూడా. ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల మార్పులు, అనారోగ్య సమస్యలు, మెడిసిన్స్, పోషకాల లోపం, జుట్టును క్లీన్ గా ఉంచుకోకపోవడం వంటివెన్నో జుట్టును ఊడిపోయేలా చేస్తున్నాయి.
మీకు తెలుసా.. జుట్టు బలంగా ఉండాలంటే బలమైన ఆహారం తినాలి. అంటే పోషకాలు ఎక్కువగా ఉండే మాంసం, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. శరీరంలో విటమిన్ల లోపం లేకుంటేనే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ హెయిర్ ఫాల్ ను ఆపుతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
ఉల్లిపాయ రసం
ఉల్లి మన ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంతో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు ఈ రసం జుట్టు వేగంగా పెరిగేందుకు, నల్లగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ ముక్కలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు దానిని జల్లెడలో వేసి వడకట్టండి. ఆ రసంలో దూదిని ముంచి మాడుకు అప్లైం చేయండి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా నీటితో కడిగేయండి. అయితే నెత్తిపై ఉల్లిపాయ వాసన వస్తే.. మైల్డ్ షాంపూను యూజ్ చేయండి. వాసన పోతుంది.
కొబ్బరి నీరు
కొబ్బరి నీటిని తాగడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. వడదెబ్బ కొట్టే ఛాన్స్ కూడా తగ్గుతుంది. అయితే ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. హెయిర్ ఫాల్ ను ఆపడానికి కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపండి. దీన్నినెత్తిమీద అప్లై చేయండి. 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత నెత్తిని శుభ్రంగా కడిగేయండి.
కలబంద రసం
కలబంద మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది చర్మానికే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద గుజ్జును తీసి నెత్తికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు రాలడం ఆగిపోయి.. ఆరోగ్యంగా పెరుగుతుంది.
వీటితో పాటుగా..
జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే పోషాకాలు ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు, గింజలు, చేపలు, మాంసం వంటి వాటిని తరచుగా తినండి. ఇవి మీ జుట్టు ఊడిపోవడం ఆగేలా చేయడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.
బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కప్పి ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే జుట్టును అలాగే వదిలేయడం వల్ల దుమ్ము, దూళి వంటివి జుట్టుకు పట్టుకునే అవకాశం ఉంది. వీటివల్ల జుట్టు బలహీనపడుతుంది. దీంతో విపరీతంగా వెట్రుకలు రాలిపోతాయి.
ఒత్తిడి కూడా జుట్టు ఊడిపోయేలా చేస్తుంది. అయినా ఈ కాలంలో ఒత్తిడి లేని మనిషి లేడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ఒత్తిడి ఒక్క జుట్టునే కాదు.. మీ పూర్తి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతే జుట్టు పెరగడం ఆగిపోతుంది. అలాగే జుట్టు విపరీతంగా రాలిపోతుంది కూడా. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా లాంటివి చేయండి. ఇవి ఒత్తిడిని తగ్గించి మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.