Alcohol: మద్యం తాగడం వల్ల కాలేయం చెడిపోతుందన్నది నిజం. అయితే కొత్తగా ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టేవాళ్లకి ఒక సందేహం ఉంటుంది.. మద్యం తాగాక ఎన్నేళ్లకు కాలేయం దెబ్బతింటుంది అని.
మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతినడానికి ఏళ్లు పడుతుందని చాలామంది అనుకుంటారు. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజూ ఎక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల కొద్ది వారాలు లేదా కొన్ని నెలల్లోనే కాలేయ కణాల్లో అనవసరమైన కొవ్వు చేరడం మొదలవుతుంది. దీనిని వైద్య పరిభాషలో అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ప్రారంభ దశలో ఎలాంటి తీవ్రమైన రోగ లక్షణాలు కనిపించవు. కొద్దిపాటి అలసట, పొట్ట పైభాగంలో అసౌకర్యం మాత్రమే ఉంటాయి. ఈ సమయంలోనే మద్యం అలవాటు పూర్తిగా మానేస్తే కాలేయం దానంతట అదే కోలుకుంటుంది.
23
ప్రతిరోజూ మద్యం తాగితే
ఫ్యాటీ లివర్ సమస్యను గమనించకుండా నిరంతరం తాగుతూనే ఉంటే కాలేయంలో తీవ్రమైన మంట, వాపు వస్తాయి. దీనిని అల్కహాలిక్ హెపటైటిస్ అని పిలుస్తారు. ఈ స్థితిలో శరీరంలో ఆకలి బాగా మందగిస్తుంది, విపరీతమైన నీరసం వస్తుంది. కడుపునొప్పి పెరగడంతో పాటు కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారి కామెర్లు వస్తాయి. ఇక్కడ కూడా అప్రమత్తం కాకపోతే కాలేయ కణాలు పూర్తిగా నాశనమైపోతాయి. ఆ కణాల స్థానంలో గట్టి మచ్చలు ఏర్పడటం మొదలవుతుంది. అప్పుడు ఈ సమస్య చివరి దశ అయిన సిర్రోసిస్ రోగంగా మారి ప్రాణాలకే ప్రమాదం తెస్తుంది.
33
తరచూ పరీక్షలు తప్పవు
కాలేయం ప్రారంభంలో ఎంత చెడిపోయినా మళ్లీ కొత్త కణాలను తయారుచేసుకునే అద్భుత శక్తి దానికి ఉంటుంది. ఫ్యాటీ లివర్, తొలి దశ వాపు ఉన్నప్పుడు మద్యానికి దూరంగా ఉంటే సహజ స్థితికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాధి సిర్రోసిస్ దాకా ముదిరితే మాత్రం ఏర్పడిన మచ్చలను పూర్తిగా నయం చేయడం వైద్యుల వల్ల కూడా కాదు. అప్పుడు మద్యం మానేయడం ద్వారా మిగిలిన భాగాన్ని కాపాడుకోవడం ఒక్కటే మార్గం. అందుకే మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్ళు ప్రమాదకర లక్షణాలు బయటపడే దాకా ఆగకుండా తరచూ పరీక్షలు చేయించుకోవడం, చెడు అలవాటును వదులుకోవడం ఎంతో ముఖ్యం.