ఈ మినియేచర్ ఖురాన్ ప్రత్యేకత కేవలం దాని పరిమాణంలోనే లేదు. అతి చిన్న ప్రదేశంలో అరబిక్ లిపిని రాయడం, దాన్ని పుస్తక రూపంలో రూపొందించడం అప్పటి కళాకారుల నైపుణ్యాన్ని చూపిస్తుంది. సాలార్ జంగ్ మ్యూజియంలో అరబిక్, పర్షియన్ మాన్యుస్క్రిప్టులకు ప్రత్యేకమైన విభాగం ఉంది. ఇక్కడ వివిధ కాలాలకు చెందిన అరుదైన మతపరమైన, చారిత్రక గ్రంథాలు భద్రపరిచారు. ఈ మాన్యుస్క్రిప్టులు వివిధ ఆకారాలు, పరిమాణాల్లో ఉన్నాయని మ్యూజియం చెబుతోంది. ఈ మ్యూజియంలో అత్యంత చిన్న ఖురాన్ మాత్రమే కాదు.. పెద్ద పరిమాణంలో ఉన్న ఖురాన్ కూడా ఇక్కడే ఉంది. రెండు ఖురాన్ లు ఇక్కడే ఉండటం విశేషం.
ఒకే మ్యూజియంలో ఇన్ని అరుదైన మాన్యుస్క్రిప్టులు ..
సాలార్ జంగ్ మ్యూజియం లైబ్రరీలో అరబిక్ భాషకు చెందిన 2,500కు పైగా మాన్యుస్క్రిప్టులు ఉన్నాయని మ్యూజియం పేర్కొంటోంది. వీటిలో మతం మాత్రమే కాకుండా గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం, వ్యవసాయం, వంటలు, సుగంధ ద్రవ్యాలు వంటి విభిన్న అంశాలకు సంబంధించిన పురాతన గ్రంథాలు కూడా ఉన్నాయి.