Tourist Destinations to Avoid: ఈ సీజన్‌లో ఈ 7 పర్యాటక ప్రాంతాలకు అసలు వెళ్లకండి

First Published | Aug 3, 2024, 2:54 PM IST

రుతు పవనాల ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో దేశంలోని 7 ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో పర్యాటకానికి విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. సెలవులు వస్తే ఏదో ఒక కొత్త ప్రాంతాన్ని చుట్టి రావాలని చాలా మంది అనుకుంటున్నారు. కొందరు యూత్‌ అయితే బ్యాగ్‌ సర్దేసుకొని దేశమంతా తిరిగేస్తున్నారు. అయితే, కొన్ని సీజన్లలో కొన్ని ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. 

ముఖ్యంగా ఈ సీజన్‌లో రుతు పవనాల కారణంగా భారీ కురిసి వరదలు ముంచెత్తే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నట్టుండి వరద పోటెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల హైవేల పైనుంచి రాకపోకలు సాగించడం కష్టతరంగా మారింది.  


వర్షాలు, వరదల బెడత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి దేశంలోని కొన్ని ప్రఖ్యాత ప్రాంతాలకు ప్రయాణించడం మానుకోవడమే ఉత్తమం. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 7 పర్యాటక ప్రాంతాలను ప్రస్తుతం మీ టూర్‌ జాబితాలో లేకుండా చూసుకోవడం ఉత్తమం. 

మహారాష్ట్ర - ముంబై

దేశంలోని ఈ పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. విమాన సేవలు రీ షెడ్యూల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబైలో పర్యటించేందుకు వెళితే ఇబ్బందులు తప్పవు మరి. 

కేరళ

ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి వందలాది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటికీ అక్కడ భయానక వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాబట్టి, కేరళలో పర్వత యాత్రలకు ఇది సరైన సమయం కాదు.

గోవా

యువత ఎక్కువగా సందర్శించాలనుకునే టూరిస్ట్‌ ఏరియాల్లో గోవా ఒకటి. అక్కడి బీచ్‌ల అందాలను తిలకించేందుకు ఏడాది పొడవునా టూరిస్టులు క్యూ కడుతుంటారు. అయితే, భారీ వర్షాల కారణంగా అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా వరకు పర్యాటక ప్రాంతాలు నీట మునిగాయి.

కర్ణాటక - కూర్గ్

కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఇక్కడ కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. పర్యాటకులు ఈ స్థలాన్ని సందర్శించే ముందు వాతావరణాన్ని తప్పనిసరిగా చెక్‌ చేసుకోవడం ఉత్తమం.

హిమాచల్ ప్రదేశ్ - కులు

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్‌ బర్స్ట్‌ కారణంగా ఇటీవల భారీ విపత్తు నెలకొంది. కుండపోత వానలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ వరదల్లో 30 మందికి పైగా గల్లంతయ్యారు. కులు పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

కర్ణాటక - ఉడిపి

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా అపారమైన పంట నష్టం జరిగింది. అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. రవాణా, విద్యుత్తు సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ సమయంలో ఉడిపికి టూరిస్టులు వెళ్లకపోవడం మంచిదని అధికారులు చెబుతున్నారు.

మేఘాలయ

మేఘాలయలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టితో పాటు వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సీజన్‌లో మేఘాలయలోని పర్యాటక ప్రాంతాల సందర్శన ప్లాన్ చేసుకోకపోవడం మంచిది.

Latest Videos

click me!