
ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలోనే రోగాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్ లో దగ్గు, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లతో పాటుగా అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుంది. హైపర్ టెన్షన్ అని కూడా పిలువబడే హై బీపీ ఈ రోజుల్లో అత్యంత సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. హై బీపీ వల్ల తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, భయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హై బీపీకి చికిత్స చేయకపోతే.. అధిక రక్తపోటు మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. అలాగే గుండె ఆగిపోవడం, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ఈ రక్తపోటును నియంత్రించడానికి సమతుల్య ఆహారం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీ ఆహారంలో సోడియం తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటును బాగా పెంచుతుంది. అయితే ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలను తింటే మీ రక్తపోటు మెరుగుపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతులు
మెంతుల్లో ఎక్కువ మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మొత్తం చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెంతి విత్తనాలు, ఆకుల్లో తక్కువ ఉప్పు కంటెంట్ ఉంటుంది.
నారింజ
అధిక రక్తపోటు పేషెంట్లతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ సిట్రస్ పండు ఎంతగానో ఉపయోగపడతాయి. నారింజలో మెగ్నీషియం, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ రక్తపోటును బాగా తగ్గిస్తాయి. నారింజ రసం తాగితే మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరలు
మన శరీరంలో ఉన్నఅనవసరమైన ఉప్పును తొలగించడానికి ఆకుపచ్చ కూరగాయలు మీకు బాగా సహాయపడతాయి. ఆకుపచ్చ కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తపోటును తగ్గించడానికి.. బచ్చలికూర, క్యాబేజీ, కాలే, సోంపు లేదా పాలకూరను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి.
beet root
బీట్ రూట్
బీట్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే దీనిలో ఉండే బి విటమిన్లు నాడీ పనితీరును మెరుగుపరుస్తాయి కూడా. ఇది మీ రక్త నాళాలు విశ్రాంతి తీసుకోవడానికి, వాటిని విస్తరించడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
ముల్లంగి
ముల్లంగిలో ఉండే పొటాషియం మీ శరీరం రక్త ప్రవాహ నియంత్రణను నిర్వహించడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. మీకు రక్తపోటు చరిత్ర ఉంటే దీనిని తప్పకుండా తీసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు. ఇది హార్ట్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
వెల్లుల్లి
రక్తపోటును నియంత్రించడానికి వెల్లుల్లి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి ఎంతగానో సహాయపడుతుంది. బీపీ తగ్గాలంటే ఉదయం గ్లాస్ నీటిలో పచ్చి వెల్లుల్లిని వేసి తాగండి.
పెరుగు
పెరుగు రక్తపోటు తగ్గించడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో అధిక రక్తపోటును తగ్గించడం ఒకటి. మీ రక్తపోటును తగ్గించడానికి తక్కువ కొవ్వు ఉన్న పెరుగును తినండి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే దీనిలో ఉండే కాల్షియం మీ ఎముకలను బలంగా చేస్తుంది.
సహజంగా రక్తపోటును తగ్గించడానికి మందులు తీసుకోవడంతో పాటుగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోండి. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగాను చేయండి. వీటివల్ల హృదయ స్పందన రేటు, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.