IMD Rain Alert : ఆఫ్రికా దేశాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద నీరు జనావాసాలను చుట్టుముట్టడంతో పలు దేశాల్లో భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇండియాలో కూడా వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
IMD Rain Alert : కేవలం భారత్ లోనే కాదు ప్రపంచ దేశాలను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియాలను వర్షాలు ముంచెత్తగా తాజాగా ఆఫ్రికన్ కంట్రీస్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, మొజాంబిక్ దేశాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి... జనావాసాలను ఉధృత ప్రవాహాలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల్లో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇక వరదల ధాటికి వేలాది ఆస్తులు ధ్వంసమయ్యాయి... లక్షలాదిమంది రోడ్డునపడ్డారు. మరికొన్నిరోజులు ఇదే స్థాయిలో వర్షాలుంటాయని ఆయా దేశాల వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.
25
తెలంగాణలోనూ అకాల వర్షాలు..?
ఇక భారతదేశంలోనూ కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేవలం వర్షాకాలంలోనే కాదు శీతాకాలం, వేసవి కాలాల్లోనూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే వేసవిలో ఎల్ నినో ప్రభావంతో అకాల వర్షాలు, అత్యధిక ఎండలు తప్పవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి ఎండింగ్ నుండి మార్చ్, ఏప్రిల్ లో వర్షాలు కురుస్తాయని... ఈ సమయంలో ఎండల తీవ్రత తక్కువగానే ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. తర్వాత మే, జూన్ లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని... ఎండలు మండిపోతూ వడగాలుల వీస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
35
తెలంగాణలో పెరిగిన చలిగాలులు
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ చలి తీవ్రత పెరుగుతోంది. సంక్రాంతి సమయంలో చలి తక్కువగా ఉంటూ పొగమంచుతో పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కానీ పండగ ముగిసిందో లేదో మళ్లీ చలి ఇరగదీస్తోంది. రాబోయే రోజుల్లో శీతాకాలం సాధారణంగా నమోదయ్యే అత్యల్ప ఉష్ఫోగ్రతల కంటే 2 నుండి 4 డిగ్రీలు తక్కువగా తెలంగాణ టెంపరేచర్స్ ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 5 నుండి 10 డిగ్రీలలోపు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఇక రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్ లో 11 నుండి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
55
మళ్లీ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
నిన్న(జనవరి 18, ఆదివారం) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మెదక్ లో 10.8, హన్మకొండలో 11.5, రామగుండంలో 11.8, నిజామాబాద్ లో 15.2, ఖమ్మంలో 15.8, మహబూబ్ నగర్ లో 15.7. భద్రాచలంలో 16.6, నల్గొండలొ 17.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో కూడా మళ్లీ సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా పటాన్ చెరు ఈక్రిశాట్ పరిసరాల్లో 9.2 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. రాజేంద్ర నగర్ లో 11, దుండిగల్ లో 13.4, హకీంపేటలో 13.8, హయత్ నగర్ లో 13.9. బేగంపేటలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది.