Trump: మొన్నటి వరకు టారిఫ్‌లతో విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇది షాకింగ్ విషయం అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న భారతీయులు, చైనా సహా అనేక దేశాల నిపుణులకు ట్రంప్ షాకింగ్ న్యూస్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆదేశాల ప్రకారం, ప్రతి హెచ్-1బీ వీసాపై ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన ఇప్పటికే సంతకం చేశారు.
25
విదేశీ నిపుణులపై ఆంక్షలు
అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ వివరించిన ప్రకారం, ఈ నిర్ణయంపై అన్ని పెద్ద టెక్ కంపెనీలకు సమాచారం అందించామన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘‘విదేశీ సిబ్బందిని తీసుకురావడం కాకుండా, మన దేశంలోని యూనివర్సిటీల్లో చదువుకున్న యువతకు అవకాశాలు ఇవ్వండి. అమెరికన్లకే ఉద్యోగాలు, శిక్షణ ఇవ్వాలి’’ అని ఆయన స్పష్టం చేశారు. అంటే, అమెరికా ఉద్యోగ మార్కెట్‌ను స్థానికులకు పరిమితం చేయాలనే వ్యూహంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
35
టెక్ రంగం స్పందన ఏంటంటే.?
ఈ మార్పుపై గూగుల్, యాపిల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ట్రంప్ మాత్రం టెక్ రంగం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని, వారు చాలా సంతోషిస్తారన్నారు. అయితే కంపెనీలు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి రావడం వల్ల కొత్తగా ఉద్యోగ నియామకాలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
1990లో ప్రారంభమైన హెచ్-1బీ వీసా, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విధానం. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాల ద్వారా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులను నియమించుకుంటాయి. ప్రస్తుతం ఇండియా వీసా పొందిన వారి 71% వాటాను, చైనా 11.7% వాటాను కలిగి ఉన్నాయి. ఈ వీసాలు సాధారణంగా మూడు నుంచి ఆరు సంవత్సరాలపాటు మంజూరు చేస్తారు. ప్రతి ఏడాది లాటరీ విధానం ద్వారా సుమారు 85 వేల వీసాలు జారీ అవుతాయి. ఇప్పటివరకు ఫీజు తక్కువగానే ఉన్నప్పటికీ, కొత్త నిర్ణయం వల్ల కంపెనీలకే పెద్ద ఆర్థిక భారమయ్యే అవకాశం ఉంది.
55
గోల్డ్‌కార్డ్ ప్రవేశపెట్టిన ట్రంప్
హెచ్-1బీ మార్పులతో పాటు, ట్రంప్ కొత్తగా “గోల్డ్‌కార్డ్” అనే పథకాన్ని కూడా ప్రకటించారు. దీని కోసం 10 లక్షల డాలర్లు రుసుముగా నిర్ణయించారు. ఈ పథకం ద్వారా అమెరికాకు సుమారు 100 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ నిధులను అభివృద్ధి ప్రాజెక్టులు, పన్ను తగ్గింపులు, రుణాల చెల్లింపులకు వినియోగించనున్నారు.