
8.8 తీవ్రతతో బుధవారం రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీరంలో సంభవించిన భూకంపం చరిత్రలో నమోదైన పది అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటి. పసిఫిక్ సముద్రగర్భంలో 47 కిలోమీటర్ల (30 మైళ్ళు) లోతులో భూకంప కేంద్రం ఉన్నా 300 కిలోమీటర్ల (200 మైళ్ళు) దూరం వరకు ప్రకంపనలతో కుదిపేసింది. పసిఫిక్ తీరప్రాంతంలో అధికారులు హెచ్చరికలు జారీ చేయడం, నగరాలను ఖాళీ చేయించడంతో పాటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్దమయ్యారు.
భూకంప తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ రష్యాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు… విపత్కర పరిస్థితులు ఏర్పడలేదు. ఈ భూకంపం కారణంగా సముద్రపు అలలు ఎగసిపడినా అప్పటికే తీరప్రాంతాల్లోని ప్రజలను తరలించడం కారణంగా రష్యాలో ప్రమాదం తప్పింది… ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
రష్యన్ స్టేట్ టెలివిజన్‌లోని ఫుటేజ్ జపాన్ సమీపంలోని ఒక మారుమూల ద్వీపంలో సుమారు 2,000 మంది జనాభా కలిగిన తీరప్రాంత పట్టణం సెవెరో-కురిల్స్క్‌ను ఢీకొంటున్న సునామీ అలలను చూపించింది. సముద్రం భవనాలను ధ్వంసం చేసి శిథిలాలను తనలో కలిపేసుకుంది. ఒక చేపల ప్లాంట్‌ను ముంచెత్తింది…పట్టణంలోని ఓడరేవును ధ్వంసం చేసింది.
తీరం నుండి 400 మీటర్ల (1,312 అడుగులు) దూరంలో ఉన్న రెండవ ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వరకు అలలు చేరుకున్నాయి. కానీ స్థానిక అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
“భూకంపం తర్వాత తగినంత సమయం ఉంది కాబట్టి అందరినీ ఖాళీ చేయించారు. అందరూ సునామీ నుండి సురక్షితంగా బైటపడ్డారు” అని మేయర్ అలెగ్జాండర్ ఒవ్స్యాన్నికోవ్ అన్నారు.
క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడాప్రమాదం తప్పిందన్నారు. “దేవుడికి ధన్యవాదాలు… ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు” అని అన్నారు. విపత్తును నివారించడంలో ప్రాంతీయ హెచ్చరిక వ్యవస్థ పాత్రను ఆయన కొనియాడారు.
భవనాలు కదిలిపోతున్నా, రోడ్లు పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలోనూ వైద్య సిబ్బంది వెనుకడుగు వేయలేదు. కమ్చట్కా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిసి పుటేజీలో భూకంపం సంభవించినప్పుడు శస్త్రచికిత్స చేస్తున్న రోగులను వైద్యులు పట్టుకున్నట్లు చూపించింది. శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులను రాష్ట్ర అవార్డులకు నామినేట్ చేస్తామని ప్రాంతీయ గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ ప్రకటించారు. “ఇటువంటి ధైర్యం అత్యున్నత ప్రశంసకు అర్హమైనది” అని ఆయన అన్నారు.
రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీకి చెందిన ఒక బృందం కురిల్ ద్వీపంలో చోటుచేసుకున్న ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. వారి టెంట్ క్యాంప్ సునామీ దెబ్బకు కొట్టుకుపోయింది.
“అలలు ఢీకొన్నప్పుడు మేము చేయగలిగినదల్లా ఎత్తైన ప్రదేశానికి పరిగెత్తడమే. జారే గడ్డి మీద పొగమంచులో బూట్లతో అలా చేయడం చాలా కష్టం” అని బృంద సభ్యురాలు వెరా కోస్టామో అన్నారు. “అన్ని టెంట్లు, నిర్మాణాలు అలల తాకిడికి కొట్టుకుపోయాయి. మా వస్తువులు వందల మీటర్ల దూరం బీచ్ అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి. కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు… అందరూ త్వరగా అప్రమత్తం అయ్యారు. కానీ మా వస్తువులన్నీ కోల్పోయాము” అని రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీ సభ్యులు తెలిపారు.
ఉత్తర కురిల్ దీవులను కలిగి ఉన్న సఖాలిన్ ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక్కడ 7.5 తీవ్రతతో భూమి కంపించింది.
రష్యాలో భూకంపం సంబవించినా సునామీ ప్రభావం లేదు… కానీ జపాన్ లో ఇది ఎక్కువగా కనిపించింది. దాదాపు రెండు మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయాలని సూచించారు. ప్రభుత్వ హెచ్చరికలతో కొందరు ప్రజలు కాలినడకన, మరికొందరు కార్లతో ఎత్తైన ప్రదేశాలకు పారిపోయారు.
ఇవాటే తీరప్రాంతంలొ 1.3 మీటర్ల ఎత్తులో సునామీ అలలు ఓడరేవులోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళ కారును వేగంగా పోనిచ్చి కొండచరియను ఢీకొట్టి మరణించిందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే సాయంత్రానికి జపనీస్ అధికారులు సునామీ హెచ్చరికలను తగ్గించారు. కానీ ప్రజల్లో భయం మాత్రం కొనసాగింది.
చిబాలోని ఇనాగే బీచ్ ను రెస్క్యూ బృందాలు మూసివేశాయి. 2011లో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి.. అందుకే ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌ను అధికారులు ఖాళీ చేయించారు.
హవాయి రాజధానిలో సునామీ సైరన్లు మోగడంతో నివాసితులు ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. “భయపడకండి… ధైర్యంగా, సురక్షితంగా ఉండండి!” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరారు.
చాలాప్రాంతాల్లో విమానాలు రద్దు చేయబడ్డాయి. చివరికి హవాయికి సునామీ హెచ్చరికను తగ్గించారు.. తీరప్రాంత ప్రజల తరలింపు ఆదేశాలను ఎత్తివేశారు.
కొలంబియా, మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, టోంగా, ఫ్రెంచ్ పాలినేషియా వరకు తీరాలకు హెచ్చరికలు పొడిగించబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మూడు మీటర్లకు మించి అలలు రావచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
ఫ్రెంచ్ పాలినేషియాలోని మార్క్వెసాస్ దీవులలో, నాలుగు మీటర్ల వరకు అలలు రాత్రిపూట వస్తాయని హెచ్చరించారు. పలావు ద్వీపంలోని అన్ని తీరప్రాంతాలను ఖాళీ చేయించారు. తైవాన్‌లో హోటల్ సిబ్బంది అతిథులను లోతట్టు ప్రాంతాలు, బీచ్‌లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.
1952 తర్వాత కమ్చట్కాను తాకిన అత్యంత బలమైన భూకంపం ఇది. చివరిసారి ఇలాంటి భూకంపమే సంభవించి పసిఫిక్ అంతటా సునామీకి కారణమయ్యింది. అయితే ఈసారి వేగవంతమైన చర్యలు, బలమైన వ్యవస్థల కారణంగా నష్టం తక్కువగా ఉంది.
“గోడలు కదులుతున్నాయి” అని కమ్చట్కా నివాసి ఒకరు రాష్ట్ర మీడియా జ్వెజ్డాతో అన్నారు. “మేము సూట్‌కేస్ ప్యాక్ చేయడం మంచిదయ్యింది… అవి పట్టుకుని బయటకు పరుగుతీసాము. పరిస్థితి చాలా భయానకంగా ఉంది” అన్నారు.
ఇప్పుడు విపత్కర పరిస్థితులు లేకున్నా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కానీ విధ్వంసం, ఉద్రిక్తతల నుండి ఇప్పటికయితే ప్రజలు బైటపడ్డారు.