పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు చోటుచేసుకుంది. స్థానిక మీడియా ప్రకారం, ఈ దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. బాధితులలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కోర్టు సముదాయంలో పార్క్ చేసిన వాహనంలో అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. అయితే, పోలీసులు దీన్ని ఆత్మాహుతి దాడిగా కూడా పరిశీలిస్తున్నారు.
పేలుడు ఎలా జరిగింది?
మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ప్రవేశ ద్వారం వద్ద ఈ పేలుడు జరిగింది. ఆ సమయంలో కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఉన్నారు. ఆకస్మికంగా చోటుచేసుకున్న భారీ శబ్ధంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సాక్షులు ఈ పేలుడు పై మాట్లాడుతూ.. "నేను నా కారును పార్క్ చేసి కోర్టు లోనికి అడుగుపెట్టగానే గేటు దగ్గర పెద్ద శబ్ధం వినిపించింది. బయటికి పరుగెత్తి చూసేసరికి రెండు మృతదేహాలు నేలపై కనిపించాయి. పలు కార్లు మంటల్లో కాలి పోతున్నాయి" అని చెప్పారు.
పేలుడు శబ్ధం సుమారు ఆరు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. వీడియోల్లో కాలిపోయిన వాహనం నుండి పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కన్పించాయి.