ప్ర‌జా ర‌వాణ వ్య‌వ‌స్థ‌లో మ‌రో అద్భుతం.. 60 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లే మెట్రో రైలు

Published : Nov 07, 2026, 03:59 PM IST

Metro Train: చైనాలో ప్రజా రవాణా వ్యవస్థలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. డ్రైవర్ లేకుండానే ప్రయాణించే మెట్రో రైలు అందుబాటులోకి వ‌చ్చింది. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఉన్న వుహాన్ నగరంలో ఈ సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

PREV
15
చైనాలోనే అత్యంత పొడవైన మెట్రో లూప్ లైన్

చైనాలోని హుబే ప్రావిన్స్‌ వుహాన్ నగరంలో మెట్రో లైన్-12 పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. సుమారు 59.9 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని చైనాలోనే అత్యంత పొడవైన మెట్రో లూప్ లైన్‌గా గుర్తిస్తున్నారు. ఇందులో మొత్తం 37 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో రైలు ఒక పూర్తి చుట్టు తిరిగి రావడానికి దాదాపు 96 నిమిషాలు పడుతుంది. ఈ మెట్రో అందుబాటులోకి రావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా రోజూ ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

25
ఏడు జిల్లాలు, రెండు ప్రధాన రైల్వే స్టేషన్లకు అనుసంధానం

వుహాన్ మెట్రో లైన్-12 నగరంలోని ఏడు ప్రధాన జిల్లాల మీదుగా వెళ్తుంది. ఇందులో కియావోకౌ, జియాంగ్‌హాన్, జియాంగ్‌ఆన్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా నగరంలోని రెండు ప్రధాన రైల్వే స్టేషన్లైన హాన్‌కౌ, వుచాంగ్‌లను ఈ మెట్రో అనుసంధానిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చే ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్రో మార్గం ఇప్పటికే ఉన్న ఇతర మెట్రో లైన్లతో కూడా అనుసంధానమై ఉంది. అవసరాన్ని బట్టి ప్రయాణికులు మరో మెట్రోలోకి మారి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వ్యాపార ప్రాంతాలు, నివాస ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ మార్గం ఎంతో సౌకర్యంగా ఉండనుంది.

35
రెండు దశల్లో నిర్మాణం.. మొత్తం 59.9 కిలోమీటర్లు

వుహాన్ మెట్రో లైన్-12 నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేశారు. మొదటి దశను మే 1న ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ దశలో సుమారు 35.3 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించారు. రెండో దశలో మరో 24.6 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మొత్తం 59.9 కిలోమీటర్ల మెట్రో లూప్ పూర్తయింది. రెండో దశ ప్రారంభంతో పూర్తి మార్గంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను ఒకే మెట్రో మార్గంతో అనుసంధానించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

45
నదుల కింద సొరంగాలు.. నిర్మాణంలో ఎన్నో సవాళ్లు

ఈ మెట్రో మార్గం నిర్మాణం ఇంజినీర్లకు పెద్ద సవాలుగా మారింది. వుహాన్ నగరం యాంగ్జీ, హాన్ నదుల కారణంగా వేర్వేరు ప్రాంతాలుగా డివైడ్ అయి ఉంటుంది. దీంతో మెట్రో మార్గాన్ని యాంగ్జీ నది కింద నుంచి రెండుసార్లు, హాన్ నది కింద నుంచి ఒకసారి నిర్మించాల్సి వచ్చింది. నదుల కింద సొరంగాలు తవ్వే సమయంలో భూమిలోని వివిధ పొరలు, నీటి తీవ్ర ఒత్తిడి, సొరంగాల్లోకి నీరు చేరే ప్రమాదం వంటి సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించేందుకు ఆధునిక యంత్రాలు, అత్యాధునిక నిర్మాణ సాంకేతికతను ఉపయోగించారు. ఫలితంగా నదుల కిందుగా వెళ్లే భూగర్భ మార్గాలతో ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయగలిగారు.

55
డ్రైవర్ అవసరం లేని రైళ్లు.. పూర్తిగా ఆటోమేటిక్ వ్యవస్థ

ఈ మెట్రో లైన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం డ్రైవర్ లేకుండానే రైళ్లు నడవడం. వుహాన్ మెట్రో లైన్-12 గ్రేడ్-4 ఆటోమేషన్ (GoA4) టెక్నాలజీతో పనిచేస్తుంది. రైలు రవాణాలో ఇదే అత్యున్నత స్థాయి ఆటోమేషన్. ఈ విధానంలో రైళ్లను నడిపేందుకు డ్రైవర్ అవసరం ఉండదు.

ఉదయం రైళ్లు ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతాయి. ప్రయాణం మొదలుపెట్టే ముందు తమ సాంకేతిక పరిస్థితిని తామే తనిఖీ చేసుకుంటాయి. అనంతరం డిపో నుంచి బయటకు వచ్చి నిర్ణయించిన స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులను చేరవేస్తాయి. రోజువారీ సేవలు పూర్తయిన తర్వాత తిరిగి డిపోకు చేరుకుంటాయి.

అంతేకాదు, రద్దీ సమయాల్లో ప్రయాణికుల సంఖ్యను బట్టి రైళ్ల మధ్య సమయాన్ని కూడా ఈ వ్యవస్థ సర్దుబాటు చేయగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకునే సామర్థ్యం ఉంది. అవసరమైనప్పుడు కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది దూరం నుంచే రైళ్ల నియంత్రణను చేపట్టగలరు. సిగ్నలింగ్, సమాచార వ్యవస్థలు, ప్లాట్‌ఫామ్ పరికరాలను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories