Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి

Published : Dec 21, 2025, 10:27 AM IST

Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ సంక్షోభంతో అనిశ్చితి నెల‌కొన్న ఈ దేశంలో ఇప్పుడు మ‌రోసారి ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఇంత‌కీ బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు స‌మ‌స్య ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో చెలరేగిన అశాంతి

బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాల్పుల్లో గాయపడి చికిత్స పొందిన‌ హాదీ సింగపూర్ ఆసుపత్రిలో మరణించడంతో నిరసనలు ఒక్కసారిగా ఉద్ధృతమయ్యాయి. శుక్ర‌వారం వరకూ ఢాకా సహా అనేక నగరాల్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. హింసాత్మక ఘటనలతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది.

25
మైనారిటీలపై దాడులు

హాదీ మృతి తర్వాత జరిగిన ఆందోళనలు కేవలం నిరసనలకే పరిమితం కాలేదు. పలుచోట్ల విధ్వంసం జరిగింది. ఢాకాలో షేక్ ముజిబుర్ రెహమాన్‌కు చెందిన 32 ధన్‌మండీ నివాసాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రాజాషాహీలో అవామీ లీగ్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ అల్లర్లలో దీపూ అనే ఒక హిందూ వ్యక్తి హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మెమెన్సింగ్ జిల్లాలో చెట్టుకు కట్టి హింసించి సజీవ దహనం చేయడం దేశంలో మతపరమైన ఉద్రిక్తత ఎంత ప్రమాదకరంగా మారిందో చూపిస్తోంది.

35
భారత్‌ వ్యతిరేక భావజాలం: రాజకీయ లబ్ధి ప్రయత్నం

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌ వ్యతిరేక స్వరం బలపడుతోంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హాదీ అంత్యక్రియలు పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించడం, లక్షలాది మందిని అక్కడికి రప్పించడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ రాజకీయాలు మరింత రాడికల్ దిశగా సాగుతున్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయి.

45
బంగాళాఖాతంలో కూడా ఉద్రిక్తతలు

భూభాగంతో పాటు సముద్రంలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకార బోట్లు తరచూ భారత జలాల్లోకి చొరబడుతున్నాయి. ఇటీవల ఓ ఘటనలో భారత మత్స్యకారుల బోటును బంగ్లా నేవీ ఢీకొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఐదుగురు మత్స్యకారులు ఇంకా కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బంగ్లా నేవీ గస్తీ పెంచడం, కోస్ట్ గార్డ్ స్థాయిలో కవ్వింపులకు దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.

55
ఇస్లామిక్ చట్టాల ప్రకటనలు: దేశ భవిష్యత్‌పై అనిశ్చితి

ఈ అశాంతి మధ్యలో బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ చట్టాలు అమలవుతాయన్న ప్రకటనలు రావడం కొత్త భయాలను రేపుతోంది. జమాత్-ఈ-ఇస్లామి నేతలు ఖురాన్ ఆధారిత చట్టాలే దేశానికి పరిష్కారం అంటూ బహిరంగంగా ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్‌పై సందేహాలు పెంచుతోంది. మైనారిటీలు, స్వేచ్ఛా భావజాల వర్గాలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే బంగ్లాదేశ్ అంతర్గత సంక్షోభం ప్రాంతీయ స్థాయికి విస్తరించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

భారత్ అప్రమత్తం: సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. త్రిపురా సరిహద్దు జిల్లాల్లో భద్రతను కఠినతరం చేసింది. అదనపు పోలీసు బలగాలు, బీఎస్‌ఎఫ్ సిబ్బంది పహారా పెంచారు. అక్రమ చొరబాట్లు, శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. త్రిపురా సీఎం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories