
సెప్టెంబర్ 11 ఉదయం దాడులకు సంబంధించిన కీలక వ్యక్తులు విమానాశ్రయాలకు చేరుకున్నారు. ఉదయం 5:45 గంటలకు మొహమ్మద్ అట్టా, అబ్దుల్ అజీజ్ అల్-ఒమారీ అనే ఇద్దరు వ్యక్తులు మైనేలోని పోర్ట్‌లాండ్ ఇంటర్నేషనల్ జెట్‌పోర్ట్‌లో భద్రతా తనిఖీలు పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి వారు బోస్టన్‌లోని లోగన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11లో ఎక్కారు.
ఉదయం 7:59 గంటలకు ఫ్లైట్ 11 బోస్టన్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరింది. అందులో 76 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది, ఐదుగురు హైజాకర్లు ఉన్నారు. ఉదయం 8:15 గంటలకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 కూడా బోస్టన్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరింది. ఇందులో 51 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది, ఐదుగురు హైజాకర్లు ఉన్నారు. మరోవైపు ఉదయం 8:20 గంటలకు ఫ్లైట్ 77 వాషింగ్టన్ సమీపంలోని డల్లాస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరింది. ఇందులో 53 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది, ఐదుగురు హైజాకర్లు ఉన్నారు. ఉదయం 8:42 గంటలకు న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి యునైటెడ్ ఫ్లైట్ 93 శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. ఇందులో 33 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది, నలుగురు హైజాకర్లు ఉన్నారు.
ఉదయం 8:19 గంటలకు ఫ్లైట్ 11లోని ఫ్లైట్ అటెండెంట్ బెట్టీ ఆన్ ఓంగ్ భూమిపై ఉన్న సిబ్బందిని సంప్రదించి విమానం హైజాక్ అయిందని సమాచారం ఇచ్చారు. కాక్‌పిట్‌ను సంప్రదించలేకపోతున్నట్లు చెప్పారు. 8:24 గంటలకు మొహమ్మద్ అట్టా చేసిన ఒక కమ్యూనికేషన్ పొరపాటుతో విమాన నియంత్రణ కేంద్రానికి హైజాకింగ్ గురించి సంకేతం అందింది.
8:37 గంటలకు బోస్టన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అమెరికా వైమానిక దళానికి సమాచారం అందించింది. అయితే అప్పటికే పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. ఉదయం 8:46 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. టవర్‌లోని పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు చిక్కుకుపోయారు. మొదట ఇది ఒక విమాన ప్రమాదమని చాలామంది భావించారు. కానీ 9:03 గంటలకు యునైటెడ్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొట్టడంతో అసలు విషయం ప్రపంచానికి అర్థమైంది. ఇది ప్రమాదం కాదు.. పక్కా ప్లానింగ్‌తో జరిగిన ఉగ్రదాడి అని స్పష్టమైంది. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాల్లో చూశారు.
దాడులు న్యూయార్క్‌కే పరిమితం కాలేదు. ఉదయం 9:37 గంటలకు ఫ్లైట్ 77 వాషింగ్టన్‌లోని పెంటగాన్‌ను ఢీకొట్టింది. విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోగా, భవనంలో ఉన్న 125 మంది పౌరులు, సైనిక సిబ్బంది కూడా మరణించారు. ఇదే సమయంలో ఫ్లైట్ 93లో ఉన్న ప్రయాణికులకు తమ విమానం కూడా హైజాక్ అయిందని తెలిసింది.
ఉదయం 9:28 గంటలకు హైజాకర్లు విమానంపై నియంత్రణ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికులు కాక్‌పిట్ వైపు వెళ్లి విమానాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఉదయం 9:57 గంటలకు వారు కాక్‌పిట్‌పైకి దూసుకెళ్లడం ప్రారంభించారు. హైజాకర్ పైలట్ విమానాన్ని అటూ ఇటూ తిప్పుతూ ప్రయాణికుల ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.
చివరకు ఉదయం 10:02 గంటలకు ఫ్లైట్ 93 పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లే సమీపంలోని ఖాళీ ప్రాంతంలో కూలిపోయింది. ఆ విమానం లక్ష్యం ఏదనేది పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే వైట్‌హౌస్ లేదా అమెరికా క్యాపిటల్ వైపు వెళ్తుండవచ్చని భావించారు. ప్రయాణికుల తిరుగుబాటు కారణంగానే ఆ విమానం లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని భావిస్తారు.
ఉదయం 9:59 గంటలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ దక్షిణ టవర్ కూలిపోయింది. కాసేపటికే ఉదయం 10:28 గంటలకు ఉత్తర టవర్ కూడా కూలిపోయింది. అప్పటికే న్యూయార్క్ నగరం భారీ దుమ్ము, పొగతో నిండిపోయింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ దాడుల నేపథ్యంలో ఉదయం 9:45 గంటలకు అమెరికా గగనతలాన్ని మూసివేశారు. దేశంలోని అన్ని పౌర విమానాలను సమీప విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ఆ సమయంలో ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఉన్నారు.
రెండో టవర్‌ను విమానం ఢీకొట్టిన విషయం ఆయనకు 9:05 గంటలకు తెలియజేశారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్ ద్వారా ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు నెబ్రాస్కాలోని ఆఫట్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చేరుకున్న ఆయనను అణు దాడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉన్న సురక్షిత బంకర్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన బిల్డింగ్ 7 కూడా కూలిపోయింది. రాత్రి 8:30 గంటలకు బుష్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
9/11 దాడులు ఒక్కరోజు జరిగిన విషాదంతో ముగియలేదు. దాని ప్రభావం అమెరికా విధానాలపై, ప్రపంచ రాజకీయాలపై చాలా కాలం కొనసాగింది. ఈ దాడులకు అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్ నాయకత్వం కారణమని అమెరికా గుర్తించింది. 1988లో అల్‌ఖైదా ఏర్పాటులో బిన్ లాడెన్ కీలక పాత్ర పోషించాడు. 1990లలో అమెరికాపై దాడులకు తన అనుచరులను సిద్ధం చేశాడు.
అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ విమాన హైజాకింగ్ దాడిని ముందుగా గుర్తించలేకపోయింది. దాడుల తర్వాత అధ్యక్షుడు బుష్ ప్రభుత్వం ‘వార్ ఆన్ టెర్రర్’ను ప్రారంభించింది. మొదట అఫ్గానిస్థాన్‌లో అల్‌ఖైదాపై చర్యలు చేపట్టగా, తర్వాత ఇరాక్‌లోనూ యుద్ధం ప్రారంభమైంది. అమెరికాలో విమానాశ్రయ భద్రతా నిబంధనలు మరింత కఠినమయ్యాయి. దేశ భద్రత కోసం కొత్తగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏర్పడింది. ఇంటెలిజెన్స్ సంస్థల మధ్య సమన్వయం పెంచేందుకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను తీసుకొచ్చారు. 9/11 దాడుల తర్వాత గ్రౌండ్ జీరోలో విషపూరిత పదార్థాల ప్రభావంతో అనేక మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 2011 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతంలో 9/11 మెమోరియల్ అండ్ మ్యూజియంను ప్రారంభించారు. ట్విన్ టవర్లు నిలిచిన ప్రదేశాల్లో నిర్మించిన రెండు ప్రతిబింబించే నీటి కొలనులు ఆ విషాదాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి.