Hyderabad Traffic Police
రోడ్డు భద్రతా నిబంధనల ప్రకారం లైట్ గేర్‌లెస్ వాహనాలనై స్కూటీ, ఎలక్ట్రిక్ స్కూటర్ లాంటి వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనీసం 16 ఏళ్ల వయసు ఉండాలి. అదే విదంగా గేర్‌తో కూడుకున్న వాహనాలకు తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో 18 ఏళ్లు నిండిన వారికి లైసెన్స్ ఇస్తారు. అయితే పిల్లలు మారం చేస్తారనో, తక్కువ దూరమే కదా అని చాలా మంది పేరెంట్స్ మైనర్లకు వాహనాలను ఇస్తుంటారు.
మైనర్లు అవగాహన రాహిత్యంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో నిండు ప్రాణాలను పోవడానికి కారణమవుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 672 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. జనవరిలో 259, ఫిబ్రవరిలో 219, మార్చిలో 194 కేసులను నమోదు చేశారు. ప్రమాదాలను కట్టడి చేసే ఉద్దేశంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు.
శనివారం నుంచి నగరవ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక చెకింగ్స్ చేపట్టనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్ వెల్లడించారు. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే వాహన యజమానిపై చట్టపరమైన కేసులు నమోదుచేస్తామని తెలిపారు. మైనర్లకు బండి ఇచ్చిన వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. సదరు వాహన రిజిస్ట్రేషన్(ఆర్‌సీ)ను కూడా 12 నెలలపాటు సస్పెండ్ చేస్తారు. సరరు మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చేదాకా డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హతా ఉండదు.
Driving Licence
కాగా మైనర్లకు వాహనమిచ్చిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, వాహనం ఇచ్చిన యజమాని, తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.