సధీర్ఘ న్యాయ పోరాటం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలు ప్రభుత్వానివేనని తీర్పు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీజీఐఐసీకి భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భూములను చదును చేయించేందుకు భారీ ఎత్తున జేసీబీలను తీసుకొచ్చారు.
అర్థరాత్రి సమయంలో జేసీబీలతో భూమిని చదును చేయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నిజానికి ఈ వీడియో తర్వాత ఈ అంశం మరింత వైరల్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం జీవ వైవిధ్యాన్ని దెబ్బతిస్తోందని, పచ్చటి చెట్లను నరికివేస్తోందని ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు సెలబ్రిటీల వరకు ప్రభుత్వ చర్యను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.