దోమల వల్ల కలిగే ప్రమాదాలు, దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మలేరియా, డెంగ్యూలతో పాటుగా దోమలు ఎన్నో ఇతర వ్యాధుల బారిన కూడా పడేస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Malaria
మలేరియా
ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేసే.. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఇది ప్లాస్మోడియం జాతికి చెందిన ఏకకణ పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి సాధారణంగా దోమ కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, ఫ్లూ లు మలేరియా లక్షణాలు. కొన్ని సందర్భాల్లో ఇది శ్వాసకోశ సమస్యలు,అవయవ వైఫల్యం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. దీనికి చికిత్స చేయకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. దీనిని నివారించడానికి బెడ్ నెట్స్, ఇండోర్ స్ప్రేయింగ్, యాంటీ మలేరియా మందులను ఉపయోగించాలి.
Image: Freepik
డెంగ్యూ
డెంగ్యూను ఈడిస్ దోమ కాటు వల్ల వస్తుంది. ఈ దోమ ఎక్కువగా నిర్మాణ ప్రదేశాలు, నీటి ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్స్, మొక్కలు, చాలా కాలంగా క్లీన్ చేయకుండా వదిలేసిన చెత్తలో, వాడకుండా ఉన్న నీటి వనరుల్లో సంతానోత్పత్తి చేస్తుంది. ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు విపరీతమైన జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, కళ్లలో అసౌకర్యం, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం, జ్వరం లేదా షాక్ సిండ్రోమ్ లు డెంగ్యూ లక్షణాలు. డెంగ్యూ బారిన పడిన వారికి మళ్లీ తీవ్రమైన డెంగ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ప్రాణాంతకం కావొచ్చు.
Image: Freepik
చికున్ గున్యా
చికున్ గున్యా వైరస్ ను ఈడిస్ ఈజిప్టి దోమలు మనకు వ్యాపింపజేస్తాయి. జ్వరం, కీళ్ల అసౌకర్యం, వాపు, కండరాల నొప్పి, తలనొప్పి, దద్దుర్లు చికున్ గున్యా లక్షణాలు. చికెన్ గున్యా సోకిన వ్యక్తి వారం రోజుల్లోనే కోలుకుంటారని, కానీ అరుదుగా ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల అసౌకర్యం నెలలు లేదా సంవత్సరాలు కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జికా వైరస్
ఈడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ పుట్టుకతో వచ్చే లోపాలు, నాడీ సంబంధిత రుగ్మతలు వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి గర్భిణులు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇది జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కీళ్ల నొప్పులు, ఎర్రని కళ్లు వంటి డెంగ్యూ మాదిరిగానే లక్షణాలను కలిగిస్తుంది. దీనిని నివారించడానికి కీటక వికర్షకాలను ఉపయోగించాలి. నిండుగా దుస్తులను వేసుకోవాలి. దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.
Yellow fever
ఎల్లో ఫీవర్
ఎల్లో ఫీవర్ అనేది ఈడిస్ దోమ ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. తేలికపాటి జ్వరం, చలి, ఆకలి లేకపోవడం, వికారం, వెన్నునొప్పి, తలనొప్పి, అలసట నుంచి తీవ్రమైన కామెర్లు, అంతర్గత రక్తస్రావం వంటివి ఎల్లో ఫీవర్ లక్షణాలు. ఎల్లో ఫీవర్ ఉన్న రోగుల పరిస్థితి సాధారణంగా ఐదు రోజుల్లో మెరుగుపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 30,000 మంది ప్రాణాలను తీస్తోంది. కానీ ఎల్లో ఫీవర్ ఇండియాలో రాదు.
West Nile Virus
వెస్ట్ నైల్ వైరస్
సోకిన క్యూలెక్స్ దోమల కాటు ద్వారా వ్యాపించే వెస్ట్ నైల్ వైరస్ తేలికపాటి జ్వరం నుంచి తీవ్రమైన నాడీ సమస్యల వరకు అనేక రకాల లక్షణాలను కలిగిస్తుంది. చాలా కేసులు తేలికపాటివి. అయితే వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు తీవ్రమైన సమస్యలు వస్తాయి.
japanese encephalitis
జపనీస్ ఎన్సెఫాలిటిస్
జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనేది వైరల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. చాలా కేసులు తేలికపాటివి లేదా లక్షణాలు లేనివిగా ఉంటాయి. అయితే తీవ్రమైన కేసులు మెదడు వాపునకు దారితీస్తాయి. కోమా లేదా మరణం కూడా రావొచ్చు.