డిసెంబర్, జనవరి మాసాల్లో చలి తీవ్రతకు చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యపరంగా పలు సమస్యలను (Health problems) ఎదుర్కొంటున్నారు. ఉన్ని దుస్తులు వేసుకున్న, చలిమంటల ముందు కూర్చున్న వెన్నులో చలి వణికిస్తుంది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు (Skin problems) మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. చలికాలంలో ఎక్కువగా బయట తిరగకూడదు.
చలికాలంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు:
చలికాలంలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో జలుబు (Cold), గొంతు నొప్పి సమస్యలు (Sore throat problems) అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలలో, వృద్ధులలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా కనబడతాయి.
చిన్న పిల్లలలో నాసిక రంధ్రాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చలి కారణంగా రక్తపోటు (Blood pressure) ఉండే వ్యక్తులకు చెమట బయటకు రాకపోవడంతో బిపి పెరిగే అవకాశాలు ఉన్నాయి. గుండె, శ్వాసకోశ సమస్యలు (Respiratory problems) ఉన్న వ్యక్తులకు చలికాలంలో మరింత ఇబ్బంది కలుగుతుంది.
ఈ కాలంలో వైరల్ జ్వరాలు (Viral fevers) కూడా అధికంగా వస్తాయి. పెదాలు పగలడం, పెదాలు నుంచి రక్తం కారడం, చర్మం పొడి బారడం, తామర, చుండ్రు (Dandruff) వంటి చర్మ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. అధిక చలి కారణంగా వృద్ధులలో కీళ్ల నొప్పులు (Arthritis), కీళ్ల వాపు సమస్యలు ఏర్పడతాయి. ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
చలికాలంలో ఎక్కువగా బయటకు తిరగరాదు. చిన్న పిల్లలను చల్లగాలిలో ఎక్కువ సమయం ఆడుకొనివ్వరాదు. శరీరాన్ని ఎల్లవేళలా వెచ్చగా ఉంచే స్వెట్టర్లు (Sweaters), స్కార్ప్ (Scarp), టోపీలు, గ్లౌజులు, సాక్స్ లను ధరించడం మంచిది. జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఉంటే ఆవిరిపట్టడం మంచిది. వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని పుక్కిలించాలి. తరచూ వేడినీటిని తాగాలి.
ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. చిన్నపిల్లలకు జలుబు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లో నాజల్ డ్రాప్స్, ఉప్పునీటి చుక్కలు వేయాలి. చలి తీవ్రత కారణంగా ఏర్పడే చర్మ సమస్యలకు దూరంగా ఉండడానికి మాయిశ్చరైజింగ్ క్రీం (Moisturizing cream), లిప్‌బామ్, వాసెలైన్ (Vaseline) లను అప్లై చేసుకోవాలి. స్నానానికి గ్లిజరిన్ ఎక్కువగా ఉండే సోపులను ఉపయోగించాలి.
కొబ్బరి నూనెను రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచే పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. చలికాలంలో ఎక్కువగా అల్లాన్ని (Ginger) వినియోగించడంతో జలుబు, దగ్గులకు దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో పిల్లలకు పసుపు పాలు ఇవ్వడం మంచిది.