మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానాన్ని ఖచ్చితంగా చేయాలి. అయితే చాలా మంది బాత్రూంకు వెళ్లామా, త్వర త్వరగా శరీరానికి సబ్బు పూసామా, నీరు పోసామా, టవల్ తో తుడుచుకున్నామా అన్నట్టే ఉంటారు. కేవలం ఐదే నిమిషాల్లో స్నానాన్ని కంప్లీట్ చేస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల మీ శరీరానికి అంటుకున్న మురికి పోనేపోదు. స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందలేరంటున్నారు నిపుణులు. అవును శరీరంపై మురికి పోకుంటే ఎన్నో వ్యాధులు వస్తాయి. అందుకే స్నానాన్ని సరైన పద్దతిలోనే చేయాలంటున్నారు నిపుణులు. ఇక రెండోది స్నానం చేసిన తర్వాత శరీరంతో పాటుగా మనసు కూడా ఫ్రెష్ గా మారుతుంది. ఆయుర్వేదంలో తినడానికి, నిద్రలేవడానికి, సరైన సమయంలో యోగా చేయడానికి నియమాలు ఉన్నట్లే.. స్నానానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్నానం చేయడానికి సరైన సమయం
ఆయుర్వేదం ప్రకారం.. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే మలవిసర్జన చేయాలి. ఆ తర్వాత దంతాలు శుభ్రం చేసుకుని ఆ వెంటనే స్నానం చేయాలి. ఇది ఉత్తమైన సమయంగా ఆయుర్వేదం భావిస్తోంది. కానీ హడావుడి, సోమరితనం వల్ల చాలా మంది చాలా మంది స్నానం కూడా చేయకుండా బయటకు వెళ్లిపోతారు. నిజానికి స్నానం చేయకపోవడం వల్ల రోజంతా సోమరిగా అనిపిస్తుంది. శరీరంతో పాటుగా మీ మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే స్నానం చేయడానికి ఈ నియమాన్ని పాటించి చూడండి. తేడాను మీరే గమనిస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల మీరు రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు. అలాగే రాత్రిపూట బాగా నిద్రపోతారు.
నీటి సరైన ఉష్ణోగ్రత
ఆయుర్వేదం ప్రకారం.. స్నానానికి చల్లని లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. ఇది మీ శరీరానికి అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేస్తే మీ శరీరానికి హాని జరుగుతుంది. దీనివల్ల మీ చర్మం పొడిబారుతుంది. వేడి నీళ్లు జుట్టును దెబ్బతీస్తాయి. వేడినీటితో స్నానం చేయడం వల్ల మీ జుట్టు గరుకుగా మారుతుంది. అలాగే బాగా తెగిపోతుంది.
స్నానం చేసే ముందు నూనెను మసాజ్
ఆయుర్వేదంలో స్నానానికి ముందు శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని పేర్కొనబడింది. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే కండరాల తిమ్మిరి కూడా తగ్గిపోతుంది. అందుకే స్నానానికి ముందు ఆవాలు, కొబ్బరి, నువ్వులు లేదా బాదం నూనెతో శరీరాన్ని పై నుంచి కిందికి మసాజ్ చేయండి. ఇలా అరగంట సేపు ఉంచి ఆ తర్వాత స్నానం చేయండి.
ఆరబెట్టడం
స్నానం చేసిన తర్వాత శరీరాన్ని టవల్ లో ఆరబెట్టడం సరికాదని ఆయుర్వేదం చెబుతోంది. అంటే స్నానం చేసిన వెంటనే టవల్ తో ఒంటిని తుడవ కుండా రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలట. దీంతో ఒంటిపై ఉన్న నీరు దానంతట అదే ఎండిపోతుంది. అయితే టవల్ తో ఒంటిని రుద్దడం వల్ల చర్మం ఊడిపోతుంది. చాలాసార్లు టవల్ ను ఎప్పటికప్పుడు కడగకపోతే మురికిగా మారుతుంది. దీంతో చర్మం కూడా దెబ్బతింటుంది.