
గత నాలుగు దశాబ్దాలుగా భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గిందని ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. కానీ ఈ వంధ్యత్వం భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచుతుంది. మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచొచ్చని నిపుణులు చెబున్నారు. అదెలాంటే..
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి
గత కొన్ని దశాబ్దాలుగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. అలాగే పర్యావరణ కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ కారకాలు పునరుత్పత్తి ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఇవి వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్ ఏజెంట్లు, అనారోగ్యకరమైన ఆహారాలు వంటి ఇతర కాలుష్య కారకాలను తగ్గించడం వల్ల స్పెర్మ్ కౌంట్, నాణ్యత మెరుగుపడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ను మీరొక్కరే ఆపలేరు. కానీ సమిష్టిగా మనం దానిని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించొద్దు
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. మొబైల్స్, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ డివైజెస్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని మన శరీరానికి చాలా దగ్గరగా ఉంచకూడదు. వీటిని ప్యాంట్ జేబుల్లో ఉంచితే సెల్ ఫోన్ నుంచి వచ్చే వై-ఫై సిగ్నల్స్ స్పెర్మ్ చలనశీలత, నాణ్యతను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. శరీరానికి దగ్గరగా ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్క్రోటల్ ఉష్ణోగ్రతను పెంచుతాయి. అలాగే స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీస్తాయి. అందుకే ఈ గ్యాడ్జెట్లను ఎప్పుడూ కూడా మీకు దగ్గరగా ఉంచకండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి
పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించాల్సిందేనంటున్నారు నిపుణులు. కానీ సరిగా లేని జీవన శైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి రుగ్మతలు యువతలో పెరుగుతున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇవి మరింత వేగంగా పెరుగుతున్నాయి. గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు మగ వంధ్యత్వం ప్రధాన కారణాలలో ఒకటి. ఏదేమైనా ఆరోగ్యకరమైన స్పెర్మ్ చలనశీలత, వీర్యం నాణ్యతకు జీవనశైలి కారకాలు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సమతుల్య ఆహారాన్ని తినండి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామంలో పాల్గొనండి. ఒత్తిడిని తగ్గించుకోండి.
మాదకద్రవ్యాల దుర్వినియోగం
స్మోకింగ్, క్రమం తప్పకుండా మందును తాగడం, అనాబాలిక్ స్టెరాయిడ్లను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి బాగా తగ్గుతుంది. అంతేకాదు వీటివల్ల స్పెర్మ్ ఉత్పత్తి మొత్తమే ఆగిపోతుంది. అలాగే తీవ్రమైన పిండం లోపాలు, పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీస్తుంది. అందుకే పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ అలవాట్లను వదిలేయండి.
లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్
చాలా మంది జంటలు తమ కెరీర్ కోసం లేట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటారు. 30 చివర్లో పిలల్ని కనాలని అనుకుంటారు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ వీర్యకణాల నాణ్యత తగ్గుతుంది. దీంతో గర్భం దాల్చడం మరింత కష్టమవుతుంది. చాలా మంది పురుషులకు ఈ నిజం తెలియదు. పురుషులు, మహిళలు ఇద్దరిలో గర్భధారణకు అనువైన వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువ. దీనిని 35 సంవత్సరాల వరకు పొడిగించొచ్చు. ఈ వయస్సు దాటితే మాత్రం పునరుత్పత్తి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వయసులో గర్భం ధరించడం కష్టమే కాకుండా గర్భధారణను నిర్వహించడం కూడా కష్టమవుతుంది. అంతేకాకుండా పిండం లోపాల ప్రమాదం కూడా పెరుగుతుంది.
తగినంత నిద్ర
పురుషుల సంతానోత్పత్తితో సహా సరైన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నాణ్యమైన నిద్ర చాలా అవసరం. ఇది స్త్రీ పురుషులిద్దరిలో హార్మోన్ల సమతుల్యత, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి రోజూ కంటి నిండా నిద్ర పోవడానికి ప్రయత్నించండి.