diabetes
డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి. ఒకప్పుడు ఈ వ్యాధి అంటేనే భయపడిపోయే వారు. కానీ ఇప్పుడు కామన్ వ్యాధిగా మారిపోయింది. ఎందుకంటే ఇది ఎంతో మందిని ప్రభావితం చేస్తోంది కాబట్టి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి పేషెంట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మీకు తెలుసా? ఈ డయాబెటిస్ క్రమంగా గుండెతో సహా అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం కూడా ప్రాణాంతక స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది.
symptoms of diabetes
మన దేశంలో డయాబెటిస్ పేషెంట్ల రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచంలోనే ఇంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశం మరొకటి లేదని నివేదికలు చెబుతున్నాయి. కొన్నేండ్ల తర్వాత పరిస్థితి మళ్లీ విషమిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ డయాబెటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మన చెడు జీవనశైలి కూడా మధుమేహం వచ్చేలా చేస్తుంది. అసలు ఎలాంటి అలవాట్లు మధుమేహానికి దారితీస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
diabetes
శారీరక శ్రమ లేకపోవడం
అవును శారీరక శ్రమ లేకుండా, వ్యాయామం చేయకుండా, శరీరం సరైన కదలిక లేకుండా ఉంటే ఖచ్చితంగా మధుమేహం వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు యువతతో సహా చాలా మంది ఇలాంటి అనారోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారు. వ్యాయామం లేనప్పుడు శరీర కదలికలు సరిగ్గా ఉండవు. దీనివల్ల రక్తంలోని చక్కెర శక్తి కోసం ఉపయోగించాల్సిన కండరాలకు చేరదు. ఇది మధుమేహానికి దారితీస్తుంది. అందుకే మీకు డయాబెటీస్ రావొద్దంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు.
చెడు ఆహారపు అలవాట్లు
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా షుగర్ వ్యాధికి దారితీస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒక్క చక్కెర మాత్రమే కాదు.. వివిధ రూపాల్లో మనం తినే స్వీట్లు, పిండి పదార్థాలు కూడా మధుమేహానికి దారితీస్తాయి. ప్రధానంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలే డయాబెటీస్ కు ఎక్కువగా కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్యాకేజ్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ను బయట ఎక్కువగా తినడం, ఇంట్లో తయారుచేసిన నార్మల్ ఫుడ్స్ ను తక్కువగా తినడం వల్ల డయాబెటీస్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బయటిఫుడ్స్ ను ఎక్కువగా తినకండి. అన్ని పోషకాలు ఉండే వివిధ ఆహారాలను మీ ఇంట్లోనే తయారుచేసుకుని తినండి. అన్నం, మాంసాహారం, కూరగాయలు, కాయలు, పప్పు దినుసులు, పండ్లు, గింజలు వంటి అనేక పోషకాలను పగటిపూట పొందడానికి ప్రయత్నించండి. స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు అంటే జంక్ ఫుడ్స్ డయాబెటిస్కు దారితీస్తాయి.
తగినంత నిద్రపోకపోవడం
నిద్ర మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. కానీ ప్రస్తుతం చాలా మంది ఏ అర్థరాత్రో పడుకుంటున్నారు. కానీ రాత్రిపూట తగినంత నిద్రపోకపోవడం, ఒత్తిడి వంటివి మధుమేహానికి దారితీస్తాయి. నేడు చాలా మంది ఈ రకమైన నిద్రలేమి, ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ రెండు సమస్యలు మీకుంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. నిద్రలేమి, ఒత్తిడి వల్ల డయాబెటిస్ మాత్రమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.