చాలామంది రాత్రిపూట గురక పెడుతుంటారు. కొందరు ఎప్పుడు నిద్రపోయినా గురక పెడుతుంటారు. దీనివల్ల పక్కన వాళ్లు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వారు సరిగ్గా నిద్రపోవడానికి అవకాశం ఉండదు. అయితే గురక పెట్టే అలవాటు చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఇది స్లీప్ అప్నియా సంకేతం కావచ్చని చెబుతున్నారు. అసలు స్లీప్ అప్నియా అంటే ఏంటీ? దానివల్ల కలిగే నష్టాలెంటో ఇక్కడ చూద్దాం.
స్లీప్ అప్నియా అంటే..
సాధారణంగా గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక రక్తపోటు గురించి మనం వింటూనే ఉంటాం. కానీ స్లీప్ అప్నియా గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. స్లీప్ అప్నియా అనేది నిద్రలో శ్వాస తీసుకోవడం ఆగిపోవడం, లేదా తక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఒక నిద్ర రుగ్మత. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎవరికి ఎక్కువగా వస్తుంది?
స్లీప్ అప్నియా ఉంటే నిద్రలో ఊపిరి ఆడదు. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలా చాలామంది చనిపోయినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. నిపుణుల ప్రకారం, 32 నుంచి 45 ఏళ్ల మధ్య స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఉంది. 50 ఏళ్లు దాటిన ఆడ, మగ ఇద్దరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
స్లీప్ అప్నియా లక్షణాలు:
- నిద్రలో బిగ్గరగా గురక
- నిద్రలో శ్వాస ఆగిపోవడం
- రోజంతా నిద్రమత్తుగా ఉండటం
- తలనొప్పి
- శ్రద్ధా లోపం
- అధికంగా చెమట రావడం
స్లీప్ అప్నియా కారణాలు:
స్లీప్ అప్నియా రావడానికి ఊబకాయం, గొంతు, గొంతు చుట్టూ కండరాల సమస్యలు, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, కుటుంబ చరిత్ర లాంటివి కారణం కావచ్చు. కాబట్టి నిద్రలో గురక సమస్య ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
జీవినశైలి మార్పులు:
బరువును కంట్రోల్లో ఉంచుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, నిద్ర సమయం, స్థానాన్ని మార్చడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.