మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మనం రోజూ తినే భోజనంలో చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇదే మనకు రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది. రీఫ్రెష్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఉదయం పూట హెల్తీ ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ కొంతమందికి ఉదయం పూట అస్సలు తినాలనిపించదు. ఆకలి అసలే కాదు. కానీ దీనివల్ల మీ ఒంట్లో శక్తి తగ్గడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆకలి కాకపోవడానికి ఎన్నో రోగాలు కూడా కారణమంటున్నారు నిపుణులు. అసలు ఆకలి ఎందుకు కాదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఒత్తిడి
గజిబిజీ లైఫ్ లో ఒత్తిడిలేకుండా ఉండేవారు చాలా తక్కవ మందే ఉన్నారు. కానీ చాలా మందికి ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు ఉదయాన్నే పెరుగుతుంటాయి. ఇది మీ ఆకలిని బాగా తగ్గిస్తుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ హార్మోన్ బాగా పెరిగి ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Loss Of Appetite
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం
చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే పరిగడుపున కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ నిద్రమబ్బును పోగొట్టి రీఫ్రెష్ గా చేస్తుంది. కానీ ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ ను కూడా పెంచుతుంది.
రాత్రిపూట ఎక్కువగా తినడం
కొంతమంది రాత్రి పూట ఎక్కువగా తింటుంటారు. కానీ ఇలా రాత్రి హెవీగా తినడం వల్ల ఉదయాన్నే జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల ఆకలి తీరదు. రాత్రి తిన్నది అరగకపోవడం వల్ల ఆకలిగా అనిపించదని నిపుణులు అంటున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం
మన శరీరానికి శారీరక శ్రమ చాలా చాలా అవసరం. ఇది మనల్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. మీరు పొద్దున్నే నిద్రలేచి ఏ యాక్టివిటీలో పాల్గొనకపోతే కూడా ఆకలిగా అనిపించదు. అందుకే ఉదయం నిద్రలేచిన తర్వాత వాకింగ్, జాగింగ్, యోగా వంటివి చేయండి.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. కొంతమంది బరువు పెరగకూడదని మరికొంతమంది పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఉదయం తినకుండా ఉంటారు. కానీ దీనివల్ల మధ్యాహ్నం లేదా రాత్రి పూట ఎక్కువగా తినాల్సి వస్తుంది. ఇది ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది.