ఆకలి లేకున్నా అతిగా తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Mar 27, 2024, 2:18 PM IST

ఖాళీగా ఉంటే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. దీనికి ఆకలి కావాల్సిన అవసరం లేదు. కానీ ఆకలి కాకున్నా అతిగా తింటే మాత్రం మీరు ఎన్నో సమస్యల బారిన పడటం మాత్రం ఖాయం. 
 

మనలో చాలా మంది ఆకలి లేకున్నా తింటుంటారు. కొన్నికొన్ని సార్లు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం, ఇంకొన్ని సార్లు ప్లేట్ లో మిగిలిపోయిన ఫుడ్ ను కంప్లీట్ చేయడం, పని మధ్యలో స్నాక్స్ ను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఆకలి లేకున్నా తింటే మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఆకలి లేకున్నా తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆకలి

ముందుగా ప్రతి ఒక్కరు ఆకలి అయినప్పుడు, కానప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలి. మన శరీరం ఫుడ్ ను తినాలని, తినొద్దని ఎన్నో సంకేతాలు ఇస్తుంది. దీనికి రెండు రకాల హార్మోన్లు ఉంటాయి. ఒకటి గ్రెలిన్, రెండు లెప్టిన్. ఈ హార్మోన్లు మన శరీరానికి ఆకలి సంకేతాలను ఇస్తాయి. వీటిలో గ్రెలిన్ ఆకలిని సూచిస్తుంది. లెప్టిన్ కడుపు నిండటాన్ని సూచిస్తుంది. అయితే కొంతమందికి ఫుడ్ ను తిన్న 20 నిమిషాల తర్వాత కడుపు నిండినట్టు అనిపిస్తుంది. 


ఆకలి లేకున్నా తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హై ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి కొద్దిసేపటి తర్వాత తగ్గుతాయి. దీని వల్ల అలసట, చిరాకు కలుగుతాయి. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

ఆకలి లేకున్నా అతిగా తినడం వల్ల శరీరంలో కేలరీల పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. మనలో చాలా మంది టీవీ, మొబైల్ చూస్తూ తింటుంటారు. కానీ ఇలా తినడం వల్ల కడుపు నిండినట్టు అనిపించక ఎక్కువగా తింటుంటాం. 

జీర్ణ ఎంజైములు ఆహారం వాసనతో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఆకలి కాకున్నా తినడం వల్ల మెదడు జీర్ణ ప్రక్రియలను సూచించలేకపోతుంది. అలాగే కడుపులోని ఆహారాన్ని జీర్ణం చేయడం స్టార్ట్ చేయదు. దీనివల్ల మీకు అజీర్ణ సమస్య వచ్చి జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
 

మనం తినే ఫుడ్ మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. మనకు ఇష్టమైన ఆహారాన్ని అతిగా తినడం వల్ల డోపామైన్ విడుదల అవుతుంది. అలాగే మనకు మంచి అనుభూతి కలుగుతుంది. కానీ దీనివల్ల మన మూడ్ ఫాస్ట్ గా మారిపోతుంది. 2001 అధ్యయనం ప్రకారం.. ఆహారం ఒక వ్యసనం లాంటిది. ఇది మన ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఆకలి లేకున్నా తినడం మీకు ఆనందాన్ని ఇవ్వడం లాంటిది.
 

2018 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఫుడ్ కోరికలు, పేలవమైన నిద్ర నాణ్యత మధ్య సంబంధం ఉంది. ఈ అధ్యయనం ప్రకారం.. నిద్ర తక్కువగా పోయే వారిలో 60 శాతం మంది రాత్రిపూట స్నాక్స్ తిన్నారు. కాబట్టి ఆకలి లేనప్పుడు కూడా స్నాక్స్ తినడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుందని ఈ అధ్యయనంలో తేలింది.

click me!