బరువు తగ్గడం.. తద్వారా ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకోవడం. ఇప్పుడు వయసు బేధం లేకుండా ప్రతొక్కరి తారకమంత్రం. దీనికోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని, తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు.
అయితే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ బరువు తగ్గాలన్న మీ లక్ష్యాన్ని మాత్రం చేరుకోనివ్వవు.. అవేంటో తెలిస్తే.. వాటిమీద అవగాహన ఉంటే.. బరువుతగ్గాలని డైటింగ్ చేసేవారు కాస్త జాగ్రత్త పడవచ్చు.
స్మూతీ : తాజపండ్లు, కూరగాయాలతో తయారు చేసే స్మూతీ నిజానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అయితే దీంట్లో అంతర్లీనంగా కలిసిపోయి ఉండే చక్కెర మీ శరీరంలోకి మీకు తెలియకుండానే ఎక్కువ క్యాలరీను చేరుస్తుంది.
ఫ్లేవర్డ్ యోగార్ట్ : పెరుగు కడుపుకు చాలా మంచిది. ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే చాలా ఫ్లేవర్డ్ యోగార్ట్ లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోకుండా చేస్తుంది. దీనికంటే ఇంట్లోని సహజసిద్ధమైన మామూలు పెరుగు తినడం మంచిది.
కాజు, పిస్తా, బాదాంలాంటి నట్స్ మంచివే. ఆరోగ్యకరమైన కొవ్వు, పోషకాలు, తక్కువ క్యాలరీలతో ఉండే ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. కానీ మంచివి అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయట.
గ్రనోలా : ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండే గ్రనోలా బ్రేక్ ఫాస్ట్ కు సరిగ్గా సరిపోయే ఆరోగ్యకరమైన ఆహారం. అయితే తక్కువతో ఎక్కువ శక్తిని అందించే ఈ ఆహారపదార్థంలో నూనెపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువు తగ్గే ఆలోచనను దూరం పెట్టేలా చేస్తాయి. మీ శ్రమ వృధా అవ్వడానికి తోడ్పడ్తాయి.
ప్రీ ప్యాక్డ్ పాప్ కార్న్ : ఫైబర్ చాలా ఎక్కువగా ఉండే స్నాక్ ఐటమ్ పాప్ కార్న్. అయితే ప్రీ ప్యాక్డ్ పాప్ కార్న్ లేదా మైక్రోవేవ్ చేసిన పాప్ కార్న్ ఆరోగ్యానికి అంత మంచివి కావు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. బరువు తగ్గే క్రమంలో ఇవి తీసుకుంటే మీరు ఇబ్బందులో పడతారని చెబుతున్నారు.
అగేవ్ సిరప్ : చక్కెర, తేనెలకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతుంటారు. అయితే దీంట్లో ఫ్రక్టోస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకత్వాన్ని తగ్గించి, శరీర మెటబాలిజం దెబ్బతినేలా చేస్తుంది. చివరికి ఇది మీ వెయిట్ లాస్ ప్రక్రియను దెబ్బతీస్తుంది.
రెస్టారెంట్ సలాడ్స్ : తాజా పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ తో పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుంది సలాడ్స్. అయితే వీటిని ఇంట్లో చేసుకోవడం కాకుండా రెస్టారెంట్ల నుంచి తెప్పించుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి. సలాడ్స్ మీద వేసే ఎక్స్ ట్రా టాపింగ్స్ తో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అవకడో : శరీరానికి అవకడో చాలా చాలా మంచిది. అయితే వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మంచిది కదా అని మోతాదు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.