ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. ఎందుకంటే నిద్రే మన శరీరాన్ని తిరిగి ఎనర్జిటిక్ గా మారుస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ రెగ్యులర్ గా కంటినిండా నిద్రపోకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డాక్టర్ ను సంప్రదించాలి. ఇక సోషల్ మీడియాలో ఎక్కువ సేపు యాక్టీవ్ గా ఉండేవారు కూడా ప్రతి రోజూ 8 గంటలు నిద్రపోయేలా షెడ్యూల్ చేసుకోవాలి. సగటున ఒక వ్యక్తికి రాత్రిపూట 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. మరి నిద్రలేమితో వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మెమోరీ పవర్ తగ్గడం
అవును నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏకాగ్రత, శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందుకే రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటైనా నిద్రపోయేలా చూసుకోండి.
ఇమ్యూనిటీ పవర్
మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం పడుతుంది. తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా మీకు ఎన్నో వ్యాధులు, అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు.
మానసిక ససమస్యలు
మీరు సరిగ్గా నిద్రపోకపోతే.. ఉదయం లేచిన వెంటనే చిరాకు కలుగుతుంది. ఆ రోజంతా మీరు చిరాకుగానే ఉంటారు. అలాగే ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశం కూడా ఉంది.
బరువు పెరగడం
నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఆకలి, అనారోగ్యకరమైన ఆహారం కోసం మీలో కోరికలను పెంచుతుంది. దీంతో మీరు విపరీతంగా తిని బాగా బరువు పెరుగుతారు.
గుండె సంబంధిత వ్యాధులు
నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన రోగాలేమీ రాకూడదంటే మీరు కంటినిండా నిద్రపోవాలి.
డయాబెటీస్
నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చర్మ సమస్యలు
నిద్రలేమి వల్ల కూడా ఎణ్నో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా మీ చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల మీ చర్మం పొడిబారడం, ముడతలు పడటం, తామర వంటి చర్మ సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది.