
తమలపాకును ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పెళ్లిళ్ల నుంచి పండుగల వరకు ప్రతి వేడుకలో తమలపాకును ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ ఆకు రుచికరంగా ఉండటమే కాదు.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా? అవును తమలపాకు మధుమేహాన్ని నియంత్రించడం నుంచి ఒత్తిడిని తగ్గించడం వరకు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
రీసెర్చ్ గేట్ ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 నుంచి 20 మిలియన్ల మంది తమలపాకులను తింటారు. ఈ ఆకు సాంప్రదాయకంగా భారతదేశంలో 55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. వార్షిక ఉత్పత్తి సుమారు 9000 మిలియన్ రూపాయలు. సగటున 66 శాతం ఉత్పత్తి పశ్చిమబెంగాల్ నుంచే వస్తోంది.
తమలపాకులోని పోషక విలువలు
తమలపాకులో యాంటీ డయాబెటిక్, కార్డియోవాస్కులర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల తమలపాకులో 1.3 మైక్రోగ్రాముల అయోడిన్, 4.6 మైక్రోగ్రాముల పొటాషియం, 1.9 మోల్ లేదా 2.9 ఎంసిజి విటమిన్ ఎ, 13 మైక్రోగ్రాముల విటమిన్ బి1, 0.63 నుంచి 0.89 మైక్రోగ్రాముల నికోటినిక్ ఆమ్లం ఉంటాయి. ఈ తమలపాకును తింటే ఏయే సమస్యలు తగ్గిపోతాయంటే..
మలబద్దకాన్నితగ్గిస్తుంది
తమలపాకులను యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్ గా పరిగణిస్తారు. ఇవి శరీరంలో పీహెచ్ స్థాయిని నార్మల్ గా ఉంచుతాయి. ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్ధకం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదర సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే తమలపాకులను నూరి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీటిని వడగట్టి పరిగడుపున తాగాలి.
నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
తమలపాకులో అనేక యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన, దంతాలు పసుపుపచ్చగా మారడం, ఫలకం, దంత క్షయం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. భోజనం తర్వాత తమలపాకుతో చేసిన పేస్ట్ ను కొద్దిగా నమలడం వల్ల నోటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకులో సహజ యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. అలాగే నోటిని పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి.
శ్వాసకోశ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది
ఆయుర్వేదంలో తమలపాకును దగ్గు, బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఉండే సమ్మేళనాలు దగ్గును తగ్గించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది
తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేస్తుంది. తమలపాకులో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు శరీరం నుంచి కాటెకోలమైన్ అనే సేంద్రీయ సమ్మేళనాన్ని విడుదల చేస్తాయి. అందుకే తమలపాకులను నమలడం వల్ల మూడ్ స్వింగ్స్ సమస్యే ఉండదు.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
తమలపాకులు యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్యను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగకుండా తమలపాకులు నిరోధిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఉదయం పరిగడుపున దాని ఆకులను నమలడం వల్ల ప్రయోజనం పొందుతారు.
అంతేకాదు తమలపాకు జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఆకులు మీ జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడతాయి. మీ జుట్టు పొడుగ్గా పెరగాలంటే తమలపాకు హెయిర్ మాస్క్ లను ఉపయోగించండి.
తమలపాకులను ఎలా తినాలి?
1. మధుమేహాన్ని నియంత్రించాలంటే ఉదయాన్నే పరగడుపున తమలపాకులను నమలడం మంచిది.
2. ఒత్తిడికి గురైతే సాదా లేదా తీయని తమలపాకును తినండి. దీని ఫినోలిక్ సమ్మేళనాలు మీ మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
3. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే వడకట్టిన ఈ నీటిని తాగండి.