ఉదయం టీ తాగితే మంచిదా? కాఫీ తాగితే మంచిదా?

First Published | Sep 17, 2024, 5:08 PM IST

ప్రతి ఒక్కరికీ ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంతమందికి టీ నచ్చితే, మరికొంతమందికి కాఫీ నచ్చుతుంది. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

మనలో ప్రతి ఒక్కరికీ ఉదయాన్నే టీ లేదా కాఫీని తాగే అలవాటు ఉంటుంది. వీటివల్ల నిద్ర మబ్బు వదిలి శరీరం రీఫ్రెష్ అవుతుంది. అలాగే కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఏదేమైనా మీరు టీ లేదా కాఫీని లిమిట్ లో తాగితేనే వీటి నుంచి ప్రయోజనాలను పొందుతారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. టీ లేదా కాఫీ రెండింటిలో ఉండే కెఫిన్ ఎనర్జీని అందిస్తుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అలాగే యాంగ్జైటీ, పార్కిన్సన్ వ్యాధి, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ ను కూడా తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

అయినప్పటికీ కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే ఆందోళన పెరుగుతుంది చిరాకు గా ఉంటుంది. సాయంత్రం వేళ వీటిని తాగితే రాత్రిళ్లు నిద్రపట్టదు. కాబట్టి ఉదయం పూట కాఫీ తాగితే మంచిదా? టీ తాగితే మంచిదా? అన్న ముచ్చటను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కెఫిన్

కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తాగితే మీకు త్వరగా శక్తి అందుతుంది. కానీ టీలో ఎల్-థియనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కెఫిన్ తో కలిసి ఎక్కువసేపు మానసికంగా అప్రమత్తంగా ఉంచడానికి మీకు సహాయపడుతుంది. అంటే కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తే.. టీ తాగితే నెమ్మదిగా, మరింత స్థిరమైన శక్తి అందుతుందన్న మాట. 

యాంటీఆక్సిడెంట్లు

టీ , కాఫీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, ఫ్రీ రాడికల్స్ వల్ల  కలిగే శరీరంలో కణాల నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి. కాఫీ, టీ లో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ రెండింటిలో ముఖ్యంగా పాలీఫెనాల్స్ ఉంటాయి. కాబట్టి కాఫీ,  టీ రెండింటిలో మీ ఆరోగ్యానికి మేలు చేసే సమ్మేళనాలు ఉంటాయి. 

కాఫీ తాగే వారికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ కాఫీ తాగితే నాడీ, జీవక్రియ, కాలేయ సమస్యల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది లుకేమియా, ప్రోస్టేట్, ఎండోమెట్రియల్, చర్మ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా కనుగొన్నారు. 


కాఫీలో క్యాన్సర్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. అయితే అధిక రక్తపోటు, స్ట్రెస్, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి టీ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఉదయాన్నే కాఫీ కంటే టీ తాగడమే ఆరోగ్యకరమని నిపుణులు అంటున్నారు. 

కాఫీ లేదా టీలో ఏది ఎక్కువ శక్తిని ఇస్తుందంటే కాఫీ. కాఫీలో  కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు  ఇది ఎక్కువ శక్తిని ఇస్తుంది. అయినా దీన్ని మోతాదులోనే తాగాలి. కాఫీ లో కంటే టీలోనే కెఫిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. 

ఉదయం టీ తాగితే మంచిదా? కాఫీ తాగితే మంచిదా? 

ఉదయం లేవగానే ఎవ్వరికైనా కొంచెం బద్దకంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే కాఫీ తాగితే మీకు తక్షణ శక్తి అందుతుంది. అయితే "టీలో ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది.ఇది మీకు రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. 

కాఫీని ఎక్సకువగా తాగితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కానీ ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. కాఫీ ఎక్కువ తాగితే మూత్రానికి చాలా సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. ఇకపోతే టీ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. 

టీ ముఖ్యంగా గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ వీటి రకాలు, మొత్తాలు మారుతాయి. 

కాఫీ, టీ రెండింటిలో కాఫీ టీ కంటే ఎక్కువ ఆమ్లంగా ఉంటుంది. ఇది కొంతమందిలో కడుపు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. టీ కడుపుపై సున్నితంగా ఉంటుంది. ఇది యాసిడ్ సున్నితత్వం లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది.

ఫైనల్ గా ఉదయం టీ తాగాలా? కాఫీ తాగాలా? అనేది మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ టీ లేదా కాఫీని లిమిట్ లో తాగితేనే ప్రయోజనం పొందుతారు. 

Latest Videos

click me!