
పొట్ట, నడుము, తొడలు, శరీరంలోని ఇతర భాగాలపై పేరుకుపోయిన కొవ్వు మిమ్మల్ని ఊబకాయం బారిన పడేస్తుంది. నిజానికి ఎక్కువసేపు కూర్చోవడం, అతిగా తినడం వల్ల శరీరంపై కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది మీ బరువును పెంచడమే కాకుండా ఈ పెరిగిన బరువు మీ అంతర్గత అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. కాలేయం, ప్యాంక్రియాస్ చుట్టూ కొవ్వు పొర కూడా ఏర్పడుతుంది. ఊబకాయం అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహంతో సహా ఎన్నో వ్యాధులను కలిగిస్తుంది. అంతేకాదు ఇది మీరు తొందరగా చనిపోయేలా కూడా చేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అధిక బరువు, ఊబకాయం అసాధారణమైన, కొవ్వును ఎక్కువగా పెంచుతున్నాయి. దీనివల్ల ఎన్నో రోగాల ముప్పు పెరుగుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్ఐ) 25 కంటే ఎక్కువ ఉంటే మీరు అధిక బరువు కేటగిరీలో ఉన్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్లకు పైగా ప్రజలు ఊబకాయంతో మరణిస్తున్నారు. అసలు ఊబకాయం ఎలాంటి రోగాలకు దారితీస్తుందంటే..
type 2 diabetes
టైప్ 2 డయాబెటిస్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న ప్రతి 10 మందిలో 8 మంది ఊబకాయంతో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది. మధుమేహంతో పాటు హైబీపీ, గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలు, కంటి సమస్యలతో కూడా వీరు బాధపడుతున్నారు. మీరు షుగర్ సమస్యతో బాధపడుతుంటే శరీర బరువును 5 నుంచి 7 కిలోలు తగ్గించడం చాలా ముఖ్యం. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి.
కండరాల నొప్పి
వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. ఊబకాయం పెరగడం వల్ల ఎన్నో శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఊబకాయం పెరగడం వల్ల శరీర భాగాల్లో నొప్పి, దృఢత్వం, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి. ఊబకాయం వల్ల నడుము, మోకాళ్లు, కాళ్లు, చేతులలో తేలికపాటి నొప్పిగా అనిపిస్తుంది. అంతేకాదు ఎక్కువ సేపు నిలబడటం వల్ల వెన్నెముకలో నొప్పి వస్తుంది. ఊబకాయం పెరగడం వల్ల కాళ్లు, మోకాళ్లపై శరీర బరువు ఎక్కువ పడుతుంది. దీనివల్ల నొప్పి వస్తుంది. ఇందుకోసం శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడం అవసరం.
గర్భధారణ సమయంలో సంభవించే సమస్యలు
బరువు ఎక్కువగా ఉండటం వల్ల గర్భధారణలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఊబకాయంతో ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న మహిళలకు జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకు కారణం ప్రీక్లాంప్సియా. దీని ప్రభావం తల్లీబిడ్డ ఇద్దరిపైనా కనిపిస్తుంది. దీనివల్ల గర్భిణీ స్త్రీకి సి-సెక్షన్ డెలివరీని సూచిస్తారు. అదే సమయంలో డెలివరీ తర్వాత కూడా ఈ సమస్య తగ్గిపోవడానికి సమయం పడుతుంది.
స్ట్రోక్ ప్రమాదం
హార్వర్డ్ ఎడ్యుకేషన్ ప్రకారం.. ధమనులలో రక్తం గడ్డకట్టడంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా రావొచ్చు. 2.3 మిలియన్ల మందితో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక బరువు స్ట్రోక్ ప్రమాదాన్ని 22 శాతం పెంచుతుంది. ఊబకాయం కారణంగా ఈ ప్రమాదం 64 శాతానికి చేరుకుంటుంది.
హార్వర్డ్ ఎడ్యుకేషన్ ప్రకారం.. ఊబకాయం మన వయస్సును తగ్గిస్తుంది. బరువు తగ్గడం వల్ల ఊబకాయానికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గుతాయి. స్థూలకాయం ఉన్నవారు.. వారు 5 నుండి 10 శాతం బరువు తగ్గితే వారు అనేక ఆరోగ్య ప్రమాదాలను నివారించొచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం,, అధిక బరువు, ఊబకాయాన్ని ఎలా నియంత్రించాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అధిక బరువు, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడానికి కేలరీలను, చక్కెరను తగ్గించాలి.
అలాగే సీజనల్ పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, గింజలను తినాలి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మన శారీరక ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
వ్యాయామంతో కూడా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం శారీరకంగా చురుకుగా ఉండండి. పిల్లలు వారానికి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. పెద్దలు ఫిట్నెస్ కోసం వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి.
అలాగే 6 నెలల వరకు పిల్లలకు తల్లి పాలివ్వడం శిశువులను ఊబకాయం నుంచి రక్షించడానికి పనిచేస్తుంది.