
చురుగ్గా, ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా చాలా ముఖ్యం. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే భోజనం తర్వాత మీరు ఏం చేస్తారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు నడవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలా నడవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిచే అలవాటు ప్రాచీన కాలం నుంచీ ఉంది. ఇది జీర్ణక్రియకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. ప్రతి భోజనం తర్వాత 100 అడుగులు నడవడం వల్ల అజీర్థి సమస్యే ఉండదు. శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి వేగంగా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
100 అడుగులు ఎలా ప్రయోజనకరంగా ఉంటాయి?
తిన్న తర్వాత 100 అడుగులు నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే కేలరీల బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే తిన్న ఆహారాన్ని జీర్ణవ్యవస్థలోకి మంచి మార్గంలో తరలించడానికి సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.
కఫం లోపాలను తగ్గిస్తుంది
నిపుణుల ప్రకారం.. భోజనం తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కఫం లోపాలు కూడా తగ్గుతాయి. అయితే ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుున్నారు. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల శరీరంలో నీటి శాతం అంటే కఫ దోషం పెరుగుతుంది. అలాగే శరీరంలో కొవ్వు కూడా పెరుగుతుంది. ఇది శరీర జీవక్రియలను నెమ్మదిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు.
ఎక్కువ సేపు నడక మంచిది కాదు
భోజనం చేసిన వెంటనే ఎక్కువ దూరం నడిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువ దూరం నడవడంతో పాటుగా ఈత కొట్టడం, ప్రయాణం చేయడం, భోజనం తర్వాత వ్యాయామం చేయడం, హెవీ పనులను చేయడం కూడా మంచిది కాదు. ఈ పనులన్నీ వాతంను పెంచుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది. అలాగే ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. జీర్ణక్రియలో సమస్యలు కూడా ఎసిడిటీ, గ్యాస్ కు కారణం కావొచ్చు. అందుకే భోజనం తర్వాత ఖచ్చితంగా నడవండి. కానీ వేగంగా నడవకండి. ఎందుకంటే ఇది శరీరంలో లోపాలను పెంచుతుంది.
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం హానికరం
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. భోజనం తర్వాత 100 అడుగులు నడవాలని, ఆ తర్వాత ఎడమవైపు పడుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.