సాఫీగా రావడం లేదా? ఇలా చేస్తే మలబద్దకం మాయం..!

First Published Jun 3, 2023, 10:30 AM IST

నీళ్లను తాగకపోవడం, కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. నిజానికి మలబద్దకం అంత చిన్న సమస్య కాదు. దీనివల్ల ఎన్నో  అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..
 

బిజీ బిజీ లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో మలబద్దకం ఒకటి. ఈ అలవాట్లు జీర్ణవ్యవస్థపై ఎంతో ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇది బరువు పెరగడానికి, మలబద్దకానికి దారితీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. వారానికి మూడుసార్లు కంటే తక్కువసార్లు మలవిసర్జన చేయడం మలబద్దకం తీవ్రమైన సమస్యను సూచిస్తుంది. మరి మలబద్ధకం నుంచి తక్షణమే ఉపశమనం కలిగించే కొన్ని హోం రెమెడీస్  గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే  ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీ రోజు వారి పనులను కూడా సక్రమంగా చేసుకోలేరు. ఆకలి లేకపోవడం, చంచలత, బలహీనత లేదా అలసట, కడుపు నొప్పి, వాంతులు వంటివి మలబద్దకం లక్షణాలు. 

మలబద్దకానికి కారణమేంటి?

మలబద్దకానికి ప్రధాన కారణాలు.. తగినన్ని నీళ్లను తాగకపోవడం, మీ ఆహారంలో ఫైబర్ లేకపోవడమేనని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటికి తోడు నిశ్చల జీవనశైలి, జీర్ణశయాంతర సమస్యలు మలబద్దకానికి దారితీస్తాయి. క్లీవ్ల్యాండ్ క్లినిక్ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. గర్భిణీ స్త్రీలు, ప్రసవం తర్వాత మహిళల్లో మలబద్దకం సమస్య సర్వ సాధారణం. హార్మోన్ల మార్పులు దీనికి కారణం. మరి మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గోరువెచ్చని పాలలో నెయ్యి

గోరువెచ్చని పాలలో లేదా వేడి నీటితో  కొద్దిగా నెయ్యిని కలిపి తాగడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. నిజానికి ఇది పురాతన, అత్యంత ప్రభావవంతమైన చిట్కా. ఈ కలయిక 15 నిమిషాల్లో ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది. ఒక చెంచా నెయ్యిని గోరువెచ్చని లేదా వేడి పాలలో కలిపి తాగాలి. నెయ్యి మలానికి తేమను జోడిస్తుంది. అలాగే మలాన్ని మృదువుగా చేస్తుంది. గోరువెచ్చని పాలు కడుపును వేగంగా శుభ్రపరచడానికి సహాయపడతాయి.
 

జీలకర్ర, అజ్వైన్ 

జీలకర్ర, అజ్వైన్ కడుపు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ప్రేగు కదలికలను సులభతరం చేయడంతో పాటుగా ఎసిడిటీ, వాంతులు, కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. ఈ రెమెడీని తయారు చేయడానికి రెండు చెంచాల జీలకర్ర, రెండు చెంచాల వామును వేయించి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమానికి అర టీస్పూన్ నల్ల ఉప్పు వేసి గోరువెచ్చని కలిపి తాగండి. జీలకర్ర, అజ్వైన్ రెండూ ఉదర సంబంధిత సమస్యలను తొందరగా తగ్గిస్తాయి. ఇక నల్ల ఉప్పు జీర్ణక్రియకు సహాయపడుతుంది.
 

constipation

నానబెట్టిన ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష మలబద్ధకం నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  ఇందుకోసం 8 నుంచి 10 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం గోరువెచ్చని పాలతో కలిపి తాగండి. ఆయుర్వేదం ప్రకారం.. ఎండుద్రాక్షలను తినడం వల్ల కడుపు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గిపోతాయి. 
 

మసాజ్

మలబద్ధకానికి వేడి నూనె మసాజ్ ప్రభావవంతంగా ఉంటుందని ఆయుర్వేదం భావిస్తోంది. గోరువెచ్చని నూనెలో వామును మిక్స్ చేసి పొత్తికడుపు కింది భాగంలో మసాజ్ చేయాలి. ఈ మసాజ్ వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఎసిడిటీ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నూనె నుంచి వచ్చే వేడి కండరాలను సడలించడానికి, కడుపు తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

త్రిఫల చూర్ణం 

త్రిఫల చుర్ణం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిని తయారుచేయడానికి వాము, త్రిఫల, రాతి ఉప్పును సమాన పరిమాణంలో కలపండి. ఈ పొడిని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్దకం తగ్గిపోతుంది. 
 

click me!