ఇంట్లో మొక్కలను పెంచడమంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. నిజానికి మొక్కలు మన ఇంటి వాతావరణాన్ని అందంగా మార్చడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో నెగిటివిటీని తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఉంచడానికి సహాయపడతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
తులసి మొక్క
హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా చూస్తారు. అందుకే ఇంటికి ఒక తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలంటారు పెద్దలు. ఈ తులసి మొక్క ఆకులు దగ్గు, జలుబు వంటి ఎన్నో సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఈ మొక్క ఇంట్లోని ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించేలా చేస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఈ మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి.
స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంట్లో పెడుతుంటారు. ఇదొక ఇండోర్ మొక్క. ఈ మొక్క గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. అయితే ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్తారు.
పీస్ లిల్లీ
పేరుకు తగ్గట్టుగానే పీస్ లిల్లీ మన ఇంట్లో సుఖసంతోషాలతో కూడిన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ మొక్క చూడటానికి అందంగా ఉండటమే కాదు.. ఇది గాలిని శుద్ధి చేస్తుంది కూడా. ఈ మొక్క గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెడితే ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్క ఎలా అయితే ఎదుగుతుందో.. మన ఇంట్లో సుఖసంతోషాలకు కొదవ అనేదే ఉండదని చెప్తారు. ఈ మొక్కను అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు. అసలు విషయం ఏంటంటే? ఈ మొక్కకు ఎక్కువ కేరింగ్ అవసరం లేదు. తక్కువ సూర్యరశ్మి, తక్కువ నీళ్లతో ఈ మొక్క సులువుగా పెరుగుతుంది.
కలబంద
తులసి, మనీ ప్లాంట్ తర్వాత కలబంద మొక్క భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంది. కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడమే కాకుండా.. ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. తక్కువ సంరక్షణలో సులభంగా పెరిగే ఈ మొక్క చెడు శక్తి నుంచి కూడా మీ ఇంటిని రక్షిస్తుంది.