Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్‌లో లియోనెల్ మెస్సీ పేరు తెలియని వారు ఉండరు. తన అద్భుతమైన ఆటతో కోట్లాది అభిమానులను సంపాదించిన మెస్సీ.. ఇప్పుడు వ్యాపార రంగంలోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఆయన ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
మెస్సీ 2017లో స్పెయిన్‌లోని సముద్ర తీర నగరం సిట్‌జెస్‌లో తొలి హోటల్‌ను కొనుగోలు చేసి హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన వ్యాపారాన్ని విస్తరించారు. 2018లో ఇబిజా, 2020లో మల్లోర్కా, 2021లో బాక్వేరా, 2023లో అండోరాలో కొత్త హోటళ్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన MiM హోటల్స్ బ్రాండ్ కింద స్పెయిన్, అండోరాలో మొత్తం ఆరు లగ్జరీ హోటళ్లు ఉన్నాయి. ఈ హోటళ్ల నిర్వహణను అంతర్జాతీయ హోటల్ సంస్థ మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ చూస్తోంది.
25
ప్రతి హోటల్‌లో మెస్సీ ఫుట్‌బాల్ జ్ఞాపకాలు
మెస్సీ హోటళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి హోటల్‌లో ఆయన ఫుట్‌బాల్ కెరీర్‌కు సంబంధించిన గుర్తులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయన గెలుచుకున్న ఎనిమిది బ్యాలన్ డి'ఓర్ (Ballon d'Or) అవార్డుల ప్రతిరూపాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. అండోరాలోని హోటల్‌లో అయితే అతిథుల కోసం ప్రత్యేకంగా 'బ్యాలన్ డి'ఓర్' థీమ్‌తో చాక్లెట్ డెజర్ట్ కూడా అందిస్తున్నారు. హోటళ్లలో ఉన్న హించా రెస్టారెంట్లు ప్రముఖ మిషెలిన్ స్టార్ చెఫ్ నందూ జుబానీ సహకారంతో రూపొందించారు. అలాగే ఈ హోటళ్లు పర్యావరణ హితంగా నిర్మించడంతో లీడ్ సస్టెనబిలిటీ సర్టిఫికేషన్ కూడా పొందాయి.
35
లగ్జరీ సౌకర్యాలతో ప్రత్యేక సూట్లు
అండోరాలోని హోటల్‌లో ఉన్న లియో మెస్సీ సూట్ అత్యంత విలాసవంతమైన గదిగా గుర్తింపు పొందింది. ఇందులో వ్యక్తిగత టెర్రస్, వేడి నీటితో కూడిన అవుట్‌డోర్ హాట్ టబ్, అందమైన పర్వతాల దృశ్యాలు వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సూట్‌లో ఒక రాత్రి బస చేయాలంటే 600 డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ గదితో పోలిస్తే ఇది రెండింతలకుపైగా ఖరీదైనది.
మెస్సీ పెట్టుబడులు కేవలం హోటళ్ల వరకే పరిమితం కాలేదు. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ చైన్ El Club de la Milanesaలో ఆయన వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నారు. అలాగే ప్రీమియం వైన్ బ్రాండ్‌లోనూ పెట్టుబడులు పెట్టారు. నివేదికల ప్రకారం ఆయన హోటల్, రియల్ ఎస్టేట్ సంస్థకు 23 కోట్ల యూరోలకుపైగా ఆస్తులు ఉన్నాయి. బార్సిలోనా, పారిస్, లండన్ వంటి నగరాల్లో విలువైన ఆస్తులు కూడా ఆయన సొంతం.
55
వేల కోట్ల సంపదకు ఇదే ప్రధాన కారణం
ఫుట్‌బాల్ ద్వారా వచ్చే ఆదాయం, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ప్రచార ఒప్పందాలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు, వైన్ వ్యాపారాల్లో పెట్టుబడులు.. ఇవన్నీ కలిసి మెస్సీ సంపదను భారీగా పెంచాయి. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని పలు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అందుకే మెస్సీ మైదానంలో మాత్రమే కాదు.. వ్యాపార ప్రపంచంలోనూ విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నారు.