ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కొత్త వివాదం.. అర్జెంటీనా ఆట‌గాడు ఆ బ్యాన‌ర్‌ను ఎందుకు ప్ర‌ద‌ర్శించాడు.? దాని అర్థం ఏంటి.?

Published : Jul 16, 2026, 06:29 PM IST

FIFA World Cup: 2026 ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా 2-1 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సంబరాల సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ జియోవానీ లో సెల్సో ప్రదర్శించిన ఒక బ్యానర్ వివాదానికి దారితీసింది.

PREV
15
'Las Malvinas son Argentinas' అంటే అర్థం ఏంటి?

విజ‌యం అనంత‌రం "Las Malvinas son Argentinas" అని రాసిన ఆ బ్యానర్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్పానిష్‌లో ఉన్న "Las Malvinas son Argentinas" అంటే "మాల్వినాస్ దీవులు అర్జెంటీనాకే చెందినవి" అని అర్థం. అర్జెంటీనా, ఫాక్‌ల్యాండ్ దీవులను "లాస్ మాల్వినాస్" అని పిలుస్తుంది. ప్రస్తుతం ఈ దీవులు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. ఇవి అర్జెంటీనా తూర్పు తీరానికి సుమారు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సెమీఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జియోవానీ లో సెల్సో, మరో ఆటగాడు నికోలస్ ఒటమెండీ కలిసి ఈ బ్యానర్‌ను అభిమానుల నుంచి తీసుకుని కొద్దిసేపు ప్రదర్శించారు. తర్వాత దానిని మైదానంపై ఉంచి విజయోత్సవాలు కొనసాగించారు.

25
ఫాక్‌ల్యాండ్ దీవులపై వివాదం ఎందుకు?

ఫాక్‌ల్యాండ్ దీవుల యాజమాన్యంపై అర్జెంటీనా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య దాదాపు 190 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ వివాదం మొదలైంది. 1832లో బ్రిటన్ ఈ దీవులపై మళ్లీ నియంత్రణ సాధించింది. 1982లో అప్పటి అర్జెంటీనా సైనిక ప్రభుత్వం ఈ దీవులను స్వాధీనం చేసుకునేందుకు దాడి చేసింది.

దీంతో ఫాక్‌ల్యాండ్ యుద్ధం జరిగింది. ఏప్రిల్ 2 నుంచి జూన్ 14 వరకు సాగిన ఈ యుద్ధంలో చివరకు అర్జెంటీనా ఓటమి పాలైంది. ఈ యుద్ధంలో 255 మంది బ్రిటిష్ సైనికులు, 649 మంది అర్జెంటీనా సైనికులు, ముగ్గురు పౌరులు మరణించారు. అయినా ఇప్పటికీ ఈ దీవులపై తమకే హక్కు ఉందని అర్జెంటీనా వాదిస్తోంది.

35
అర్జెంటీనా ప్రభుత్వం ఏమంది?

ప్రపంచకప్ సెమీఫైనల్‌కు కొన్ని రోజుల ముందే అర్జెంటీనా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో బ్రిటన్ నౌక HMS Medway మాల్వినాస్ దీవుల పరిసరాల్లో ప్రయాణించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధమని పేర్కొంది. అలాగే మాల్వినాస్ దీవులు, సౌత్ జార్జియా, సౌత్ సాండ్‌విచ్ దీవులు, వాటి చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలపై అర్జెంటీనాకే చట్టబద్ధమైన సార్వభౌమ హక్కు ఉందని మరోసారి స్పష్టం చేసింది. ప్రకటన చివర్లో "చరిత్ర ప్రకారం, హక్కు ప్రకారం, మా నమ్మకం ప్రకారం మాల్వినాస్ అర్జెంటీనాకే చెందుతాయి" అని పేర్కొంది.

45
ఫిఫా చ‌ర్య‌లు తీసుకుంటుందా.?

ఫిఫా, అలాగే అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) నిబంధనల ప్రకారం మ్యాచ్‌ల సమయంలో రాజకీయ సందేశాలు, నినాదాలు, చిహ్నాలు లేదా బ్యానర్లు ప్రదర్శించడం నిషేధం. ఆటగాళ్ల దుస్తులు, బ్యానర్లు లేదా ఇతర వస్తువులపై రాజకీయ సందేశాలు ఉంటే వాటిపై పోటీ నిర్వాహకులు, జాతీయ ఫుట్‌బాల్ సంఘం లేదా ఫిఫా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫిఫా స్టేడియం నిబంధనల ప్రకారం రాజకీయ, వివక్షను ప్రోత్సహించే లేదా వివాదాస్పద సందేశాలతో కూడిన బ్యానర్లు, జెండాలు, పోస్టర్లు స్టేడియంలో ప్రదర్శించడాన్ని కూడా నిషేధించింది.

55
అర్జెంటీనాపై ఎలాంటి చర్యలు ఉండొచ్చు?

ఫిఫా ఈ బ్యానర్‌ను రాజకీయ సందేశంగా పరిగణిస్తే జియోవానీ లో సెల్సోపై లేదా అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఫిఫా ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఘటనతో ఫాక్‌ల్యాండ్ దీవులపై దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ వివాదం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఫిఫా ఈ అంశాన్ని ఎలా పరిశీలిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories