నిమ్మకాయను ఎవరు తినకూడదు?

First Published | Jun 12, 2024, 1:45 PM IST

చాలా మంది ఉదయాన్నే నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగుతుంటారు. ఎందుకంటే ఇది బరువు తగ్గిస్తుందని. కానీ నిమ్మకాయ అందరికీ ఆరోగ్యంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంటే కొంతమంది నిమ్మకాయను తినకూడదు. వాళ్లు ఎవరెవరంటే?

సిట్రస్ పండ్లలో నిమ్మకాయ ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంటువ్యాధులు, ఇతర రోగాల నుంచి కాపాడుతుంది. కానీ ఈ నిమ్మకాయ ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉండదు. 

కొంతమందికి నిమ్మకాయను తింటే అన్నీ ఆరోగ్య ప్రయోజనాలే కలుగుతాయి. కానీ కొంతమందికి ఇలా కాదు. కొంతమంది నిమ్మకాయను తింటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వారు నిమ్మకాయను మొత్తమే తినకూడదు. మరి నిమ్మకాయను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


స్టమక్ అల్సర్

నిమ్మకాయ ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి ఇది గుండెల్లో మంట, పెప్టిక్ అల్సర్ వంటి జీర్ణ సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అందుకే నిమ్మకాయను ఎక్కువగా తినకూడదు. అయితే ఇప్పటికే పొట్టలో అల్సర్ సమస్యతో బాధపడేవారు నిమ్మకాయ తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు నిమ్మకాయను మొత్తమే తినకూడదు. 
 

దంతాల సమస్య

దంతాల సమస్య ఉన్నవారు కూడా నిమ్మకాయను తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే అందులో ఉండే ఆమ్లం కాలక్రమేణా దంతాల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. ఇది దంతాలు, కుహరాలను మరింత సున్నితంగా చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నిమ్మకాయ తిన్న వెంటనే నీటితో పుక్కిలించాలి.

సిట్రస్ అలెర్జీ

కొంతమందికి నిమ్మకాయ వంటి సిట్రస్ అలెర్జీ కూడా ఉంటుంది. ఈ అలెర్జీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు దురద, దద్దుర్లు, పెదవులు, నాలుక లేదా గొంతు వాపు లక్షణాలను అనుభవిస్తారు. అందుకే నిమ్మకాయను తింటే మీకు కూడా ఇలాంటి లక్షణాలు కలిగితే నిమ్మకాయను అప్పటి నుంచి తినకపోవడమే మంచిది. 
 

కిడ్నీ సమస్యలు

నిమ్మకాయలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇది ప్రభావిత వ్యక్తులకు మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అందుకే  నిమ్మకాయ వంటి ఇతర ఎక్కువ ఆక్సలేట్లు తీసుకోవడం తగ్గించడం మంచిది.

Latest Videos

click me!