curd
ఆరోగ్యకరమైన ఆహారంలో పెరుగు ఒకటి. పెరుగు ప్రోబయోటిక్ కు మంచి వనరు. దీనిలో మనకు మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి సీజన్ లో పెరుగును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే పెరుగును చలికాలంలో తినకూడదని చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే దీనివల్ల జలుబు చేస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది చలికాలంలో పెరుగును తినడానికి ఇష్పపడరు. మరి చలికాలంలో పెరుగును తినాలా? వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో కూడా పెరుగును తినొచ్చు. ఎందుకంటే ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీనిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి మాత్రమే తినాలని చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే? దీన్ని సాయంత్రం, రాత్రి అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనివల్ల జలుబు అయ్యే అవకాశం ఉంది. పెరుగును తింటే మీ జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మీరు తొంరదగా బరువు తగ్గుతారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
పెరుగును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు ప్రోబయోటిక్ ఫుడ్ కాబట్టి దీన్ని తింటే జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో పెరుగును తినడం వల్ల అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చలికాలంలో పెరుగును తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటివి రావు.
ప్రేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది
పెరుగు మన పేగులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగును తింటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు మన పేగుల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ఎముకలను బలంగా ఉంచుతుంది
పెరుగును తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. పెరుగులో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియంతో పాటుగా ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని చలికాలంలో తింటే ఎముకల నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా కూడా ఉంటాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంటుంది. అయితే ఈ సీజన్ లో మీరు పెరుగును తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. పెరుగులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
തൈര്
చర్మం, జుట్టుకు ప్రయోజనకరం
పెరుగులో ఉండే రకరకాల పోషకాలు మన చర్మానికే కాకుండా.. జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీన్ని ప్రతి రోజూ తినడం వల్ల మన చర్మం సహజంగా తేమగా ఉంటుంది. అలాగే జుట్టు మంచి రంగులో, షైనీగా మెరుస్తుంది.
బరువును నియంత్రిస్తుంది
పెరుగు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే పెరుగులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీన్ని తింటే మీరు అతిగా తినలేరు. దీంతో మీ బరువు అదుపులో ఉంటుంది. బరువు పెరగరు. ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతారు.