ఖర్జూరాలు ఒక డ్రైఫ్రూట్. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఖర్జూరాల్లో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5ఎ1 వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ కూడా మెండుగా ఉంటుంది. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.
dates
జీర్ణసమస్యలు
అజీర్ణం, మలబద్దకం సమస్యలు చాలా మందికి ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలను నానబెట్టి తినడం వల్ల మలబద్దకం నుంచి బయటపడతారు. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
రక్తహీనత
రక్తహీనత సమస్య ఎన్నో వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఈ సమస్య మగవారికంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో ఐరన్ కంటెంట్ ను పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి ఖర్జూరాలను నానబెట్టి తినడం మంచిది. నానబెట్టిన ఖర్జూరాలు శరీరంలో రక్తాన్ని పెంచుతాయి.
రక్తపోటు
అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ కు కారణమవుతుంది. ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మీరు రోజూ రెండు, మూడు ఖర్జూరాలను నానబెట్టి తినాలి.
ఎముకల ఆరోగ్యం
ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ లిమిట్ లో నానబెట్టిన ఖర్జూలను తింటే ఎముకల సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మెదడు ఆరోగ్యం
ఖర్జూరాల్లో విటమిన్ బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తెలివితేటలను పెంచుతాయి. ఖర్జూరాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇమ్యూనిటీ పవర్
నానబెట్టిన ఖర్జూరాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గా ఉన్నప్పుడే మీకు రోగాలొచ్చే ప్రమాదం తప్పుతుంది.
చర్మ ఆరోగ్యం
నానబెట్టిన ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యలను తగ్గిస్తాయి.