పండ్లలో రారాజుగా పేరొందిన మామిడిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. ఈ సీజన్ లో చాలా మంది మామిడి పండ్లతో జ్యూస్ ను చేసుకుని తాగుతుంటారు. ఈ జ్యూస్ టేస్టీగా ఉండటంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. మామిడి పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
మ్యాంగో జ్యూస్ పోషక విలువలు
మామిడి రసంలో మన శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 6 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి,ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి.
ఒక చిన్న గ్లాసు మ్యాంగో జ్యూస్ ను తాగడం వల్ల మీ శరీరానికి పొటాషియం, కార్బోహైడ్రేట్లు,మెగ్నీషియం వంటి ఖనిజాలు అందుతాయి. అలాగే ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లు అందుతాయి. మ్యాంగో జ్యూస్ లో గ్లూటామైన్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది మన మెదడు కణాలను చురుకుగా ఉంచుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అభిజ్ఞా నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మామిడి జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు
మ్యాంగో జ్యూస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ జ్యూస్ ను తాగితే మలబద్దకం తగ్గిపోతుంది. ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది. మ్యాంగో జ్యూస్ లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే చర్మ స్థితిస్థాపకతను నిర్వహిస్తుంది. ముఖంపై ముడతలను పోగొట్టేందుకు సహాయపడుతుంది.
మామిడి జ్యూస్ మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఈ పండును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మ్యాంగో జ్యూస్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అలాగే కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మ్యాంగో జ్యూస్ ను ఎక్కువగా తాగితే అలెర్జీ ప్రతిచర్యలు,చర్మపు చికాకు వంటి సమస్యలు వస్తాయి. ఏదేమైనా ఈ జ్యూస్ ను మోతాదులో తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు.