ప్రస్తుత కాలంలో ప్రమాదకరమైన రోగాలు సైతం కామన్ వ్యాధులే అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని ప్రాణాలు తీసేవి అయితే ఇంకొన్ని చికాకు కలిగించేవిగా ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అత్యంత సర్వసాధారణ అనారోగ్య సమస్యల్లో జీర్ణవ్యవస్థకు సంబంధించినవి ఒకటి. గ్యాస్, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మనం క్రమం తప్పకుండా తినే ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి వంటి అనేక అంశాలు వీటిని చాలావరకు ప్రభావితం చేస్తాయి.
ఈ జీర్ణ సమస్యల నుంచి బయటపడాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు గ్యాస్ ను కలిగిస్తాయి. దీని తర్వాత కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. మరి గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారితీసే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిక్కుళ్లు
చిక్కుళ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే పోషక లోపం పోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ ఇది కొంతమందికి గ్యాస్ సమస్యను కలిగిస్తుంది. బీన్స్, కాయలు, వేరుశెనగ, పచ్చి బఠానీలు ఎక్కువ వాయువును ఉత్పత్తి చేస్తాయి.
ఆపిల్
రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ ను దూరం పెట్టొచ్చని మాటను వినే ఉంటారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పండు ఎన్ని రోగాలను దూరం చేస్తుందో. నిజానికి యాపిల్ పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ ఆపిల్ పండు కొంతమందిలో గ్యాస్ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆపిల్స్ లోని 'సార్బిటాల్', 'ఫ్రక్టోజ్' జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కొందరిలో ఇది గ్యాస్ కు కారణమవుతుంది.
ఉల్లిపాయలు
ఉల్లి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది అందానికి, ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయల్లో ఉండే 'ఫ్రక్టాన్స్' అనే ఫైబర్ వల్ల వాయువు ఏర్పడుతుంది. ఉల్లిపాయలను పచ్చిగా (సలాడ్) తింటే గ్యాస్ సమస్య ఎక్కువగా వస్తుంది. ఉడికించిన ఉల్లిపాయలను తింటే ఇలాంటి సమస్య రాదు.
పాలు, పాల ఉత్పత్తులు
పాలు, పాల ఉత్పత్తులు కొంతమందిలో ఎక్కువ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వీటిలో జున్ను, పెరుగు, వెన్న ఉన్నాయి. వీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది.
శీతర పానీయాలు
మనం బయటి నుంచి కొనే శీతల పానీయాలు కార్బోనేటేడ్ అయితే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. ఎందుకంటే ఈ డ్రింక్స్ లో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఆహారాలన్ని ప్రతి ఒక్కరిలో గ్యాస్ సమస్యలను కలిగిస్తాయని చెప్పలేం. ఒక్కొక్కరిలో ఏదో ఒక ఆహారం ఇందుకు దారితీయొచ్చు.