బంగాళదుంపలను చక్కగా ఉడికించాలంటే.. ఇలా చేయండి..

First Published | Jun 10, 2021, 3:41 PM IST

బంగాళదుంపలను ఉడికించడం ఒక కళ. సరిగా ఉడికిన బంగాళదుంపలు మీ వంటను మరింత రుచిగా, కంటికింపుగా మార్చేస్తాయి. 

మన వంటిళ్లలో తప్పనిసరిగా ఎప్పుడూ నిల్వ ఉండే కూరగాయ బంగాళదుంప. ఏ కూర లేకపోతే అప్పటికప్పుడు రెండు బంగాళా దుంపలు కోసి స్టౌ మీద వేసేస్తే పదినిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. అంతేకాదు బంగాళా దుంప ఎలా వండినా రుచిగానే ఉంటుంది.
అందుకే ఎక్కువగా వంటకాల్లో బంగాళదుంపను వాడతాం. అంతేకాదు సమోసా, పరాటా, పావ్ బాజీ...ఇలాంటి అనేక రకాల స్నాక్న్, ఛాట్ ఐటమ్స్ లో కూడా బంగాళదుంపే మెయిన్ ఇంగ్రీడియంట్. అయితే వీటికోసం బంగాళా దుంపలను ఉడికించడంలోనే అసలు సమస్య ఉంటుంది.

అదేముంది నీళ్లు పోసి పొయ్యిమీద పెడితే సరి.. అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే బంగాళదుంపలను ఉడికించడం ఒక కళ. సరిగా ఉడికిన బంగాళదుంపలు మీ వంటను మరింత రుచిగా, కంటికింపుగా మార్చేస్తాయి.
మరి ఎలా ఉడికించాలి.. అంటే...ముందు బంగాళదుంపల మీది దుమ్ము, మట్టి పోయేలా శుభ్రంగా చేతులతోకానీ, బ్రష్ ఉపయోగించికానీ కడగాలి. ఉడికించే ముందు కూడా తొక్క తీసేయచ్చు. అయితే ఉడికించే సమయంలో తొక్కను ఉంచడం వల్ల అందులోని విటమిన్లు, పోషకాలు కోల్పోకుండా ఉంటాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇలా శుభ్రం చేసుకున్న బంగాళదుంపలను నలుచదరపు ముక్కలుగా కట్ చేసి ఉడికిస్తే తొందరగా ఉడుకుతాయి. గడ్డలు చిన్నగా ఉన్నట్లైతే ముక్కలుగా కోయనక్కరలేదు.
ఇప్పుడు, బంగాళాదుంపలను ఒక సాస్పాన్ లేదా ప్రెజర్ కుక్కర్ లో వేసి తగినంత నీరు పోయండి. బంగాళాదుంపలు పూర్తిగా మునగాలి. ఆ తరువాత నీటిలో 1 స్పూన్ ఉప్పును కలపండి. ఇప్పుడు పొయ్యిని ఆన్ చేసి, ఎక్కువ మంట మీద నీటిని మరిగించడం ద్వారా ఉడకబెట్టండి.
కాసేపటి తరువాత మంటను మీడియంకు తగ్గించండి. మూత పెట్టి మృదువుగా మారే వరకు ఉడకనివ్వండి. ఇక ప్రెజర్ కుక్కర్ లో ఉడికించేటట్టయితే 2-3 విజిల్స్ పెట్టండి. బంగాళాదుంపలు పూర్తిగా ఉడికాయా లేదా అని చూడడానికి ఫోర్క్ ను ఉపయోగించవచ్చు.
ఉడికించిన తరువాత బంగాళదుంపలను కోలాండర్ లో వేసి నీటిని డ్రెయిన్ చేసి చల్లటి నీటిలో వేసి కాసేపు ఉంచేయండి. దీనివల్ల తొక్క సులభంగా తీయడానికి వస్తుంది. ఇలా ఉడికించి, చల్లబరిచిన బంగాళాదుంపలను మూతఉన్న డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి.
బంగాళాదుంపలను మైక్రోవేవ్‌లో ఉడకబెట్టడం ఎలా? అంటే.. బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, క్యూబ్ లుగా కోసి మైక్రోవేవ్-సేఫ్ గిన్నెలో వేయాలి. వీటికి తగినంత నీరు, చిటికెడు ఉప్పు వేసి, గిన్నెను మైక్రోవేవ్-సేఫ్ ర్యాప్‌తో కవర్ చేయాలి. ఈ ర్యాప్ మీద రంధ్రాలు చేసి 5-7 నిమిషాలు మైక్రోవేవ్ చేయాలి.
అన్నిరకాల బంగాళదుంపలు ఉడికించడానికి బాగుండవు. కొన్ని తొందరగా ఉడుకుతాయి. మరికొన్ని ఎంతసేపు ఉడికించినా ఉడకవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ పిండి ఉన్న బంగాళాదుంపలు ఉడకబెట్టడానికి మంచివి.
ఒకసారి ఉడకబెట్టగానే గుజ్జుగా చేయడానికి బాగుంటాయి. ఎల్లో ఫిన్, యుకాన్ గోల్డ్ లాంటి బంగాళదుంప రకాల్లో పిండిపదార్థం తక్కువ, తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాటిని సూప్, క్యాస్రోల్స్ లోకి బాగుంటాయి.
తక్కువ పిండి బంగాళాదుంపలను వాక్స్ పొటాటో అనిపిలుస్తారు. ఇవి సలాడ్లు, టోసింగులకు సరైనవి. మిగతా వెరైటీల కంటే ఉడకబెట్టినప్పుడు ఇవి ఆకారం కోల్పోకుండా ఉంటాయి.
ఇక కుక్కర్‌లో బంగాళాదుంపలను ఉడకబెట్టినప్పుడు, కుక్కర్ అడుగు, చుట్టుపక్కల నల్లబడకుండా ఉండటానికి అందులో ఎప్పుడూ ఓ నిమ్మకాయ ముక్కను వేస్తే సరి.

Latest Videos

click me!