దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటి పండు మొదటి వరసలో ఉంటుంది. ఇవి తినడానికి సులువుగా ఉంటాయి. పోషకాలతో నిండి ఉంటాయి. అంతేకాదు.. కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా మనకు లభిస్తాయి. పండుగా మాత్రమే కాదు.. పచ్చివి కూడా కూరల రూపంలో చిప్స్ రూపంలో, రకరకాలుగా వీటిని ఆస్వాదించవచ్చు. మనకు చాలా ప్రయోజనాలు అందించే ఈ అరటి పండు విషయంలోనూ కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిలో మొదటిది.. అరటి పండు తింటే జలుబు చేయడం.
అరటిపండు తినడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయని నమ్ముతారు. పిల్లలకు కూడా కొద్దిగా జలుబు చేసినా కూడా అరటి పండు పెట్టరు. దీనిలో నిజం ఎంత..? నిజంగా అరటి పండు తింటే జలుబు చేస్తుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…
అరటిపండ్లు తినడం వల్ల దగ్గు, జలుబు వస్తుందా?
నిపుణుల ప్రకారం.. జలుబు, దగ్గు మన చుట్టూ ఉన్న గాలిలో ఉండే వైరస్‌ల వల్ల వస్తుంది, అరటిపండ్ల వల్ల కాదు. వాతావరణంలోని వైరస్ వల్ల వచ్చిన జలుబుకు అరటి పండును ఆపాదించకూడదు. అంతేకాదు.. అరటి పండు తినడం వల్ల జలుబు రాదు.
అయితే… జలుబు ఉన్నప్పుడు మాత్రం అరటి పండు తినకపోవడమే మంచిది. ఎందుకంటే.. జలుబు, దగ్గు ఉన్న సమయంలో అరటి పండు తినడం వల్ల శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది. ఆస్తమా, అలర్జీ ఉన్నవారు వీటిని తినడం వల్ల రియాక్షన్స్ వస్తాయి. అవి కూడా చాలా తక్కువగానే ఉంటాయి. జలుబు మీద అరటి పండు తిన్నా.. అది మరీ ఎక్కువ అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టదు. కాకపోతే.. ఏమీ కాదు అని మరీ ఎక్కువగా తినకూడదట. అంతేకాదు.. ఈ పండు వల్ల మనకు కలిగే నష్టం ఏమీ ఉండదు. ఎన్నో పోషకాలు ఉన్న ఈ పండు తింటే మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అరటి పండ్లలో మెగ్నీషియం, ఫైబర్ వంటి అనవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి.
జలుబు, దగ్గు సమస్యలను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?
మనం జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఆహారమే సహాయపడుతుంది. మీరు మీ డైట్ లో వెల్లుల్లి, పసుపు, తులసి, బాదం, ఉసిరి, నిమ్మ ,చిలగడదుంపలు వంటివి తీసుకోవాలి. ఈ ఆహారాలలో అవసరమైన విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ముఖ్యంగా శీతాకాలంలో మీరు ఏడాది పొడవునా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.