chapati rice
మనం తినే ఫుడ్ పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మంచి హెల్తీ ఫుడ్ ను తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. అయితే చాలా మంది డిన్నర్ లో అన్నం తింటే, మరికొంతమంది చపాతీలను తింటుంటారు. కానీ డిన్నర్ లో చపాతీ తినడం మంచిదా? అన్నం తినడం మంచిదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది.
నిజానికి అన్నం, చపాతీ మన రోజువారి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ రెండింటిని మనం ప్రతిరోజూ తింటుంటాం. కానీ పోషకాల పరంగా ఈ రెండింటిలో చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి డిన్నర్ లో అన్నం తింటే మంచిదా? చపాతీ తింటే మంచిదా? అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చపాతీ, అన్నం మధ్య పోషకాల్లో తేడా ఏంటి?
చపాతీ: చపాతీని గోధుమ పిండితో తయారుచేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే చపాతీలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్-బి కాంప్లెక్స్, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గోధుమ పిండిలో ఫైబర్, పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
అన్నం: వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, విటమిన్-బి కాంప్లెక్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే బియ్యం తెలుపు, గోధుమ రంగుల్లో కూడా ఉంటాయి. కానీ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లోనే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
చపాతీ, అన్నం ఆరోగ్య ప్రయోజనాలు
చపాతీ ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: చపాతీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
బరువు నియంత్రణ: చపాతీలో ఉండే ఫైబర్ కంటెంట్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. చపాతీని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం: గోధుమ చపాతీలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్
శక్తి వనరు - బ్రౌన్ రైస్ లో మన శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి.
కండరాల నిర్మాణం: అన్నంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను నిర్మించడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఎంతగానో సహాయపడతాయి.
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: బ్రౌన్ రైస్ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
చపాతీ లేదా అన్నం.. రెండింటిలో ఏది మంచిది?
నిజం చెప్పాలంటే అన్నం, చపాతీలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే అన్నం, చపాతీ రెండూ స్వంత ప్రయోజనాలను, నష్టాలను కలిగి ఉన్నాయి. ఈ రెండింటిలో మీరు ఏది తినాలనేది మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, అవసరాలపై ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే గోధుమ చపాతీ లేదా బ్రౌన్ రైస్ ను తినాలి.
మీకు డయాబెటీస్ ఉంటే గనుక వైట్ రైస్ ను తినడం మానేయాలి. ఎందుకంటే వీటిలో ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఆహారాలను తినాలి.