చలికాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ జబ్బున పడుతూనే ఉంటారు. అందుకే ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయట వాతావరణం చల్లగా ఉంటుందికాబట్టి.. మన శరీరాన్ని వెచ్చగా మార్చుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి, మన బాడీని వెచ్చగా మార్చాలి అందుకు తగిన ఆహారం తీసుకోవాలి. అందులో.. బెల్లం ముందు వరసలో ఉంటుంది. మరి, ఈ బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దానిని ఏ రూపంలో తీసుకోవాలో తెలుసుకుందాం….
jaggery
బెల్లంలో ఉండే పోషకాలు…
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఐరన్ మాత్రమే కాదు.. ఇతర చాలా పోషకాలు ఇందులో ఉన్నాయి. పొటాషియం, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడానికి, మన శరీరంలో రక్త శాతం పెరగడానికి, కండరాలు బలంగా మారడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు.. మనం బెల్లం తినగానే శక్తి అందుతుంది. చలికాలంలో తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.
బెల్లాన్ని ఏ రూపంలో తీసుకోవాలి?
నువ్వులు, బెల్లం…
చలికాలంలో నువ్వులతో బెల్లం కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నువ్వులను తినడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి లభిస్తాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. చలికాలంలో సమస్యలను కలిగించే జలుబు, దగ్గును నివారించడానికి నువ్వులు, బెల్లం కలిపిన మిశ్రమం సహాయపడుతుంది. చర్మ సంరక్షణకు కూడా మంచి పరిష్కారం.
అల్లంతో బెల్లం:
అల్లంతో బెల్లం కలిపి తినడం వల్ల చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు వెంటనే తగ్గుతాయి. టీలో అల్లం, బెల్లం కలుపుకోవచ్చు. నువ్వులతో చేసే లడ్డూలలో కూడా అల్లం పొడి లేదా అల్లం కలిపి తినవచ్చు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Sugarcane jaggery
వేరుశనగతో బెల్లం:
బెల్లం, వేరుశనగ మంచి చలికాలం స్నాక్ అని చెప్పవచ్చు. వేరుశనగలో ప్రోటీన్, మంచి కొవ్వులు ఉంటాయి. దీన్ని బెల్లంతో తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. చలి నుండి శరీరాన్ని రక్షించి వెచ్చగా ఉంచడానికి వేరుశనగ సహాయపడుతుంది. బెల్లం, వేరుశనగ కలిపి తినడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి, కండరాలు బలంగా మారతాయి.
నెయ్యితో బెల్లం:
కడుపు సమస్యలను తగ్గించడానికి బెల్లంను నెయ్యితో తినవచ్చు. చలికాలంలో ఇలా తింటే శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. బెల్లం, నెయ్యి డిటాక్సిఫైయర్‌లా పనిచేస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారకుండా తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది.
jaggery
పాలలో బెల్లం:
రాత్రి పడుకునే ముందు పాలలో బెల్లం కలిపి తాగితే అలసట తగ్గుతుంది. గాఢనిద్ర పోవడానికి ఈ పానీయం సహాయపడుతుంది. శరీరంలో ఇప్పటికే రక్తం తక్కువగా ఉన్నవారికి ఈ పానీయం వరం లాంటిది. రక్తం పెరగడానికి సహాయపడుతుంది. ఇనుము లభించడానికి పాలలో బెల్లం కలిపి తాగవచ్చు. ఎముకలు కూడా బలపడతాయి.