తెలంగాణలో కొద్దిరోజుల నుంచి పంట పొలాలపై మిడతలు దాడి చేస్తున్నాయి. ఒక్కసారి మిడతలన్నీ పొలంపై వాలాయంటే.. పంట మొత్తం నాశనం కావాల్సిందే. ఒకటి , రెండు కాదు.. లక్షల సంఖ్యలో వచ్చి దాడులు చేస్తున్నాయి. మిడతల దాడి తర్వాత అక్కడ ఒక పొలం ఉండేది అని చెప్పినా ఎవరూ నమ్మరు. ఆ విధంగా తయారౌతుంది.
ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా మిడతలు పేరొందాయి. ఒక పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. 10 ఏనుగులు లేదా 25 ఒంటెలు లేదా 2,500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి మిడతల గుంపు తినేస్తుంది.
పంటలను ఇంత విపరీతంగా నాశనం చేస్తున్న మిడతలను అరికట్టేందుకు కొందరు ఓ వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. అదేంటో తెలుసా.. పంటలను అవి తినకముందే.. వాటిని మనం తినేయడం. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.
చాలా దేశాల్లో పంటలను రక్షించుకునేందుకు, మిడతల బాధ నుంచి బయటపడేందుకు.. వాటిని తినేస్తున్నారు. వాటిని తినడం ఎలాంటి ప్రమాదం ఉండదని ఓ పరిశోధనలో తేలింది కూడా.
మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలా దేశాలు మిడతలను ఆహారంగా తీసుకొని వాటి బెడద తగ్గించుకున్నాయని చెబుతున్నారు.
ఆఫ్రికాలో యుగాండాలోని ఉత్తర ప్రాంతంలోని ప్రజలు కూడా మిడతలను పట్టి.. వాటిని ఆహారంగా మార్చుకొని తినేస్తున్నారు. తొలుత వారి పొలాలపై మిడతలు దాడి చేయడం వల్ల తీవ్ర పంట నష్టం జరిగిందట. అందుకని వారు ఈ మార్గం ఎంచుకున్నారు.
మిడతలను పట్టుకొని, నీటిలో ఉడికించి, ఎండబెట్టి తర్వాత వాటిని వేయించుకొని తింటున్నామని అక్కడివారు చెప్పడం విశేషం..
అయితే.. ఈ మిడతలను ఆహారంగా తీసుకోవడంపై భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. మిడతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకొనేందుకు మిడతల బాధిత ప్రాంతాల్లో యుగాండా ప్రభుత్వం రసాయనిక మందులు పిచికారీ చేయిస్తోంది. అందువల్ల మిడతలను ఆహారంగా తీసుకొంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.