ఆరోగ్యాల గని సపోటా. చూడడానికి అంత ఆకర్షనీయంగా లేకపోయినా తియ్యటి రుచితో, అద్భుతమైన ప్రయోజనాలతో ఎంతో చక్కటి పండు సపోటా. ఒక్కసారి గనక దీని అసలు రుచి చూశారంటే ఇక అస్సలు వదలిపెట్టరు.
పిల్లలు మొదట్లో అంతగా ఇష్టపడకపోయినా, వారికి బలవంతంగా రుచిచూపిస్తే ఇక ఇంకోసారి తినమని అడగాల్సిన పని ఉండదు. వాళ్లే ఎంచక్కా లాగించేస్తారు. సపోటాతో కళ్లు, కాళ్లు, కిడ్నీలకు ఎన్నో లాభలుంటాయి.
సపోటా రుచి లాగే దాని గుణం కూడా భలే తియ్యనైనది. అంతేకాదు ఇది మనకు చేకూర్చే ఆరోగ్యం కూడా స్వీట్‌గానే ఉంటుంది. సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
సపోటాలో పిండిపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ అందిస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-A కంటికి చాలా మంచిది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి.
సపోటాలోని ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సపోట సంజీవనిలా పనిచేస్తుందట.
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటిలేదని వైద్య నిపుణులు అంటున్నారు. సపోటాలో విటమిన్-B, C కూడా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సపోటాలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిగా ఉంటాయి. గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా మేలు చేస్తుందట.
రోజూ సపోటా జ్యూస్ తాగేవారికి జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా ఉండవట. ఊబకాయ సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా మంచిదేనట. నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించడంలోనూ సపోటా ఉత్తమంగా పనిచేస్తుందట.
నిద్రలేమి, అందోళనతో ఇబ్బందిపడే వ్యక్తులు సపోటా తీసుకుంటే మంచిదట. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోట మంచిది.
అయితే, డయాబెటీస్, గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ పండును తినాలి.