Abortion Law: భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయించేందుకు ఆసుపత్రులు ఒప్పుకోవు. భర్త సంతకం చేస్తేనే గర్భస్రావం చేస్తాయి. అయితే మహిళ శరీరంపై హక్కు ఆమెదేనని, ఆమెకు ఇష్టం లేకుండా గర్భాన్ని మోయాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
భార్యాభర్తల్లో ఇద్దరి నిర్ణయం మేరకే ఆసుపత్రులు అబార్షన్ చేస్తాయి. గర్భస్రావం చేయాలంటే భార్య మాత్రమే ఒప్పుకుంటే సరిపోదు.. భర్త వచ్చి తనకు అంగీకారమేనని సంతకం చేయాలి. అప్పుడే అబాషన్ కు సిద్ధమవుతాయి ఆసుపత్రులు. అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం మహిళ శరీరం పై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా ఆమెదే అని, బలవంతంగా గర్భాన్ని మోయాల్సిన అవసరం ఆమెకు లేదని తేల్చి చెప్పింది. అబార్షన్ చేయించుకోవడానికి భర్త అనుమతి అవసరం లేదని, చట్టం కూడా అలాంటి షరతులు ఎక్కడా విధించలేదని చెప్పింది. మహిళల హక్కులు, స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవాన్ని గుర్తించి ఈ తీర్పు ఇచ్చినట్టు చెప్పింది ఢిల్లీ హైకోర్టు. దీంతో దేశవ్యాప్తంగా దీనిపై ఈ అంశంపై చర్చలు మొదలయ్యాయి. కుటుంబం, సమాజం పేరుతో మహిళలపై నిర్ణయాలు రుద్దే పరిస్థితి మధ్య ఈ తీర్పు నిజంగా ఒక మైలురాయనే చెప్పుకోవాలి.
24
అసలేం జరిగింది
ఏ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇలాంటి తీర్పునిచ్చిందో తెలుసుకుందాం. ఇద్దరు భార్యాభర్తలకు పెళ్లయిన తర్వాత విభేదాలు వచ్చాయి. ఆమె 14 వారాల గర్భాన్ని అబార్షన్ చేయించుకుంది. దీనిపై భర్త అభ్యంతరం చెబుతూ ఆమెపై క్రిమినల్ కేసును పెట్టాడు. భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయించుకోవడం నేరం అని తన కేసులో ఆరోపించాడు. ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. విచారణల తర్వాత ఢిల్లీ హైకోర్టు గర్భస్రావం పై స్వతంత్ర నిర్ణయం తీసుకునే హక్కు ఆ మహిళకు ఉందని చెప్పింది. భర్త అనుమతి తప్పనిసరి అని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది.
34
భరించేది మహిళే కదా
ఈ సందర్భంగా న్యాయమూర్తి నీనా బన్సాల్ కృష్ణ మాట్లాడుతూ ‘గర్భం ధరించడం, ప్రసవం, ఆ తర్వాత ఎదురు అయ్యే శారీరక మానసిక మార్పులు వల్ల కలిగే భారం అంతా మహిళపైనే పడుతుంది. అలాంటి పరిస్థితిలో ఆమెకు ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించమని ఎలా చెబుతాము. ఆమె శరీరంపై ఆమెకు మాత్రమే హక్కు ఉంటుంది’ అని చెప్పారు. అబార్షన్ చేయించుకోవడం అనేది కుటుంబ గౌరవాన్ని, భర్త కోరికల కోసం కాకుండా మహిళ మానసిక స్థితి, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నిర్ణయమని కోర్టు వివరించింది. బలవంతంగా గర్భాన్ని మోయమని చెప్పే హక్కు ఎవరికీ లేదని తెలియజేసింది.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మహిళల పునరుత్పత్తి హక్కులపై కూడా స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించింది. వివాహ జీవితంలో సమస్యలు ఉన్నా, భర్తతో విభేదాలు ఉన్నా, తన ఆరోగ్యం సహకరించకపోయినా మహిళ గర్భం విషయంలో తన నిర్ణయాలు తాను స్వతంత్రంగా తీసుకోవచ్చు అన్నదే హైకోర్టు భావన. కేవలం ఇది అబార్షన్ అంశమే అనుకోవద్దు మహిళ వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, సమాన హక్కులపై ఇది ఎంతో శక్తివంతమైన సందేశాన్ని ఇస్తోంది. భర్త అనుమతి ఉంటేనే గర్భస్రావం చేయించుకోవాలన్నది కేవలం అపోహ మాత్రమే. తమ ఆరోగ్య పరిస్థితులు, భర్తతో ఉన్న సమస్యలు ఆధారంగా కూడా ఒక మహిళ తన నిర్ణయం మేరకు స్వతంత్రంగా గర్భస్రావం చేయించుకోవచ్చు.