Psychology: ఒక వ్యక్తి డబ్బున్నవాడని తెలిసిన వెంటనే ఎదుటివారి ప్రవర్తనలో చిన్న మార్పు ఎందుకు వస్తుంది? వారు మాట్లాడితే శ్రద్ధగా వింటారు, వారి సలహాకు విలువిస్తారు, అతని పరిచయం కోసం ప్రయత్నిస్తారు. అసలు ఎందుకిలా చేస్తారు. దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి?
ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే అతని మాటకు విలువ పెరుగుతుంది. అతను ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గౌరవం దక్కుతుంది. అతను చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటారు. అతని అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తారు. అదే వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే, అతనిలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత మంచి ఆలోచనలు ఉన్నా సమాజం అంతగా పట్టించుకోకపోవచ్చు. నిజానికి డబ్బు మనిషి విలువను నిర్ణయించదు. అయినప్పటికీ, మన సమాజంలో డబ్బు ఉన్న వ్యక్తులను ఎక్కువగా గౌరవించే పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో తెలుసుకుందాం.
26
విజయంతో కలిపి చూడటం..
సైకాలజీ ప్రకారం డబ్బును మన మెదడు “విజయం”తో కలిపి చూస్తుంది. ఒక వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బు ఉందంటే అతను జీవితంలో ఏదో సాధించాడని మనం అనుకుంటాం. అతని సంపద వెనుక కష్టపడి పనిచేయడం, తెలివి, ప్రతిభ, వ్యాపార నైపుణ్యం ఉన్నాయని ఊహిస్తాం. అయితే ప్రతి ధనవంతుడి సంపద వెనుక అతని ప్రతిభ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబ ఆస్తి, వారసత్వం, అదృష్టం, మంచి అవకాశాలు వంటి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయినప్పటికీ మనం సంపదను చూసి వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా సాధారణం.
36
అవకాశాల కోసం..
మనం సాధారణంగా విజయవంతమైన వ్యక్తుల దగ్గర ఉండాలని కోరుకుంటాం. వాళ్లతో పరిచయం ఉంటే మనకూ ఏదో ఒక విధంగా అవకాశం వస్తుందని భావిస్తాం. డబ్బున్న వ్యక్తికి పరిచయాలు ఎక్కువగా ఉండొచ్చు, వ్యాపార అవకాశాలు ఉండొచ్చు, ప్రభావం ఉండొచ్చు. అందుకే అతనితో సంబంధం పెట్టుకోవడం వల్ల మనకూ ప్రయోజనం ఉంటుందని మన మెదడు లెక్కలు వేస్తుంది. ఈ కారణంగా డబ్బుతో పాటు ఆ వ్యక్తికి సామాజిక విలువ కూడా పెరుగుతుంది.
ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కోగలడనే భావన ఇతరుల్లో ఉంటుంది. మంచి వైద్యం, విద్య, నివాసం, అవసరమైనప్పుడు సహాయం పొందే అవకాశం ఉంటుందని అనుకుంటాం. అందుకే ఆర్థిక స్థిరత్వం ఉన్న వ్యక్తిని మనసులో ఒక రకమైన “సేఫ్” వ్యక్తిగా భావించే అవకాశం ఉంటుంది. ఈ భద్రత భావన కూడా అతనిపట్ల గౌరవాన్ని పెంచుతుంది.
56
సామాజిక స్థాయి
మన సమాజంలో డబ్బు కేవలం అవసరాలను తీర్చడానికి ఉపయోగపడేది మాత్రమే కాదు. అది ఒక స్టేటస్ సింబల్‌గా కూడా మారింది. ఖరీదైన ఇల్లు, కారు, దుస్తులు, జీవనశైలి వంటివి వ్యక్తి స్థాయిని చూపించే గుర్తులుగా మారాయి. ఒక వ్యక్తి ఎంత సంపన్నంగా కనిపిస్తే, అతను అంత ముఖ్యమైన వ్యక్తి అని భావించే ధోరణి కొంతమందిలో ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మనం వ్యక్తిని అతని గుణగణాల కంటే అతని లైఫ్ స్టైల్ ని చూసి అంచనా వేస్తాం.
అలాగే డబ్బున్న వ్యక్తి చెప్పే మాటను మనం ఎక్కువగా నమ్మే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి విజయవంతమైన వ్యాపారవేత్త అయితే, అతను ఏ విషయం గురించి మాట్లాడినా అందులో నిపుణుడే అని మనం అనుకోవచ్చు. వ్యాపారంలో విజయం సాధించడం అంటే ప్రతి విషయంలోనూ అతనికి జ్ఞానం ఉందని కాదు. అయినప్పటికీ అతని ఆర్థిక విజయం ఇతర విషయాల్లో కూడా అతనికి ఒక రకమైన “క్రెడిబిలిటీ”ని తెచ్చిపెడుతుంది.
66
సమస్య ఎక్కడ అంటే?
సాధారణంగా ఒక వ్యక్తి కష్టపడి సంపాదించి, నిజాయతీగా ఎదిగి, తన సంపదను మంచి పనులకు ఉపయోగిస్తే అతని విజయాన్ని గౌరవించడం సహజమే. సమస్య ఎప్పుడు వస్తుందంటే, డబ్బే వ్యక్తి విలువకు ఏకైక కొలమానంగా మారినప్పుడు. డబ్బు ఎక్కువగా ఉందని మంచి మనిషి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే డబ్బు తక్కువగా ఉందని ఒక వ్యక్తి ప్రతిభ లేనివాడని కూడా కాదు.
కొన్నిసార్లు మనం డబ్బున్న వ్యక్తిని గౌరవిస్తున్నామనుకుంటాం. కానీ నిజానికి మనం అతని డబ్బును, అతనికి ఉన్న అధికారాన్ని లేదా అతని ద్వారా మనకు దొరికే అవకాశాలను గౌరవిస్తూ ఉండవచ్చు. ఈ తేడాను గుర్తించడం ముఖ్యం.