పబ్లిక్ టాయిలెట్‌లోకి అడుగుపెట్టగానే చాలామందికి సహజంగా వచ్చే డౌట్ “డోర్ కింద ఇంత గ్యాప్ ఎందుకు?” అని. కంప్లీట్ గా మూసి ఉంచాల్సిన చోట ఇంత ఖాళీ ఉంచడం కరెక్టేనా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అసలు ఈ డోర్ డిజైన్ వెనుక ఉన్న కారణాలు ఏంటో మీకు తెలుసా?
ప్రయాణాలు, షాపింగ్ లు, ఇతర సందర్భాల్లో చాలామంది పబ్లిక్ టాయిలెట్స్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలోకి వెళ్లినప్పుడు ఒక సందేహం తప్పకుండా వస్తుంది. “డోర్ నేల వరకు పూర్తిగా ఎందుకు ఉండదు? అని. అది అసౌకర్యంగా, ప్రైవసీకి భంగం కలిగించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ డిజైన్ వెనుక అసలు కారణం తెలిస్తే.. పబ్లిక్ టాయిలెట్స్ ని చూసే దృష్టికోణమే మారుతుంది. ఈ డోర్ డిజైన్ వెనుక భద్రత, నిర్వహణ, ఖర్చు నియంత్రణ వంటి అనేక ప్రాక్టికల్ కారణాలు దాగి ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
26
భద్రత కోసం..
పబ్లిక్ టాయిలెట్స్‌లో ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనా, స్పృహ కోల్పోయినా లేదా ప్రమాదానికి గురైనా, బయట ఉన్నవారు లోపల పరిస్థితిని గమనించడానికి ఈ గ్యాప్ ఉపయోగపడుతుంది. పూర్తిగా నేల వరకు డోర్ ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. కాళ్లు కనిపించకపోతే లోపల ఉన్నవారు పడిపోయారా, స్పృహలో ఉన్నారా అని అంచనా వేయడం కష్టం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఈ గ్యాప్ ఉపయోగపడుతుంది.
36
దుర్వినియోగం నివారించడానికి..
మరొక ముఖ్యమైన కారణం చెడు ప్రవర్తనను నివారించడం. సాధారణంగా పబ్లిక్ ప్రదేశాల్లో దుర్వినియోగం, మత్తుపదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉంటాయి. డోర్ పూర్తిగా మూసి ఉంటే, లోపల ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. డోర్ కింద గ్యాప్ ఉండటం వల్ల ఎవరో తమను గమనిస్తున్నారనే భయం లోపలికి వెళ్లినవారిలో ఉంటుంది. ఇది తప్పు పనులు చేయాలనే ఆలోచనను కొంతవరకు తగ్గిస్తుంది.
పబ్లిక్ టాయిలెట్స్‌ను తరచుగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఫ్లోర్ క్లీన్ చేసే సమయంలో నీరు, డిటర్జెంట్ ఈజీగా వెళ్లేలా డోర్ కింద గ్యాప్ ఉపయోగపడుతుంది. పూర్తిగా నేల వరకు డోర్ ఉంటే, నీరు లోపల నిల్వ ఉండి దుర్వాసన, బాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది. గ్యాప్ ఉండటం వల్ల గాలి ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. ఇది దుర్వాసన తగ్గించడంలో, టాయిలెట్‌ను ఫ్రెష్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
56
ఖర్చు తగ్గడానికి..
సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్ పెద్ద సంఖ్యలో నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి పూర్తిగా నేల వరకు ఉండే భారీ డోర్లు తయారు చేయడం, అమర్చడం ఖర్చుతో కూడుకున్న పని. పైగా అవి త్వరగా పాడవుతాయి, తేమ వల్ల వంగిపోతాయి. కింద గ్యాప్ ఉన్న తేలికపాటి డోర్లు తక్కువ ఖర్చుతో, త్వరగా మార్చగలిగే విధంగా ఉంటాయి. కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ కి ఎక్కువగా ఈ డిజైన్ డోర్లనే ఎంచుకుంటారు.
66
భద్రతా భావం..
మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పూర్తిగా మూసివేసిన చిన్న గదిలో ఉండటం కొంతమందికి అసౌకర్యం, భయం లేదా క్లాస్ట్రోఫోబియా కలిగించవచ్చు. కింద గ్యాప్ ఉండటం వల్ల ఆ భావన కొంతవరకు తగ్గుతుంది. బయట ప్రపంచంతో ఒక కనెక్షన్ ఉన్నట్టుగా అనిపించి కొంతమందికి మానసికంగా ఊరట కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులకు ఇది భద్రతా భావాన్ని ఇస్తుంది.