Male Tiger: మగ పులులు చిన్న చిన్న పులి పిల్లలను అప్పుడప్పుడు చంపేస్తూ ఉంటాయి. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తున్నా కూడా నిజమే. దీని వెనుక సరైన కారణం కూడా ఉంది. అది ప్రకృతి సిద్ధమైనది.
పిల్ల పులులను మగపిల్లలు చంపేయడం అనే విషయం వింటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయితే అవి చంపేసేది ఆకలి తట్టుకోలేక, ఆహారం కోసమో లేదా విపరీతమైన క్రూరత్వాన్ని చూపించడానికో కాదు... ప్రకృతి ధర్మం. ప్రకృతిలోని జీవులు తమ జాతిని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తాయి. అలా అనుసరించే మగ పులులు సహజ ప్రవర్తనలో భాగంగానే ఇలా పిల్లలను చంపేయడం కూడా ఒకటి. దీనిని సైన్సులో ఇన్‌ఫాంటీసైడ్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఒక మగపులి.. ఒక కొత్త ప్రాంతంలోకి వెళ్లి అక్కడున్న మరో మగ పులి రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు ఇలాంటి స్వభావం చూపిస్తుంది. అక్కడ పుట్టిన పులి పిల్లలు తన జాతివి కాకపోయినా, తన కుటుంబాన్ని కాకపోయినా, తనవి కాకపోయినా కూడా వాటిని చంపడం ద్వారా ఆ ప్రాంతంలో తన అధిపత్యానికి ఎదురు లేకుండా చేసుకుంటాయి.
24
ఇది తప్పు కాదు
ఒక మనిషి భావోద్వేగాలతో మనం ఆలోచిస్తే ఇది తప్పుగా అనిపిస్తుంది. కానీ అది అడవిలో నడిచే ప్రకృతి నియమమే. ఆడ పులికి పిల్లలు పుట్టాక అవి రెండు మూడేళ్ల పాటు తల్లి పైనే ఆధారపడతాయి. ఆ సమయంలో తల్లి పులి తిరిగి మగ పులితో జత కట్టడానికి సిద్ధంగా ఉండదు. దాంతో కొన్ని మగ పులులు పరిస్థితుల రీత్యా తనకు పుట్టని పులి పిల్లలను చంపి.. ఆడ పులిని గర్భధారణకు సిద్ధం చేస్తుంది. ఇలా చేయడం ద్వారా తన సంతానాన్ని ఆ ప్రాంతంలో పొందే అవకాశాలను పెంచుకుంటుంది. ఇది వినడానికి కాస్త కఠినంగానే ఉండొచ్చు. కానీ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం ఇది సహజమైన ప్రక్రియ గానే భావిస్తారు.
34
తల్లి కోసమే పిల్లలను చంపి
నిజానికి పులులు... సింహాల్లా గుంపులుగా తిరగవు. ఒంటరిగానే జీవిస్తాయి. మగ పులి ఆడ పులి కలిసి పిల్లల్ని పెంచవు. పిల్లల సంరక్షణ మొత్తం తల్లిపులి పైనే పడుతుంది. అందువల్ల మగపులికి పిల్లలతో భావోద్వేగ సంబంధం ఉండదు. పైగా పులులు అధికంగా ఉండే అడవిలో పులి పిల్లల మరణాల శాతం కూడా ఇందుకే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆహారం దొరకకపోవడం వల్ల, ఇతర జంతువులు దాడి చేయడం, వ్యాధులు వల్ల చాలా పులి పిల్లలు చిన్న వయసులోనే మరణిస్తాయి. అలాగే సొంత పులులే తమ పిల్లలను చంపేయడం కూడా ఇందులో భాగమే.
అలాగని ప్రతి మగ పులి.. పిల్లలను చంపేస్తుందని భావించకూడదు. సాధారణంగా కొత్త ప్రాంతాన్ని ఆక్రమించిన మగ పులిలోనే ఈ స్వభావం అధికంగా కనిపిస్తుంది. అయితే తనకు పుట్టిన సొంత పిల్లలను మగపులి చంపిన సందర్భాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తల్లి పులులు తమ పిల్లలను రక్షించేందుకు చాలా తీవ్రంగా పోరాడుతాయి. పిల్లలను వేరే ప్రాంతాలకు తరలించి కాపాడుకుంటాయి. అయినా సరే ఒక్కోసారి పులి పిల్లలు మగపులికి దొరికిపోయి ప్రాణాలు కోల్పోతాయి.