Snakes : పాములు పాలు తాగుతాయా..? అంటే మన ఆచారాలు ఒకటి చెబుతాయి… శాస్త్రం ఇంకోటి చెబుతుంది. ఇంతకూ పాములు పాలు తాగుతాయా, తాగవా..? ప్రమాదకరమైన జీవులు అయినా పాములను ఎందుకు పూజిస్తారు..?
Snakes : పాములు చాలా ప్రమాదకరమైనవి... అయినా వాటికి పాలుపోసి మరీ పూజిస్తుంటారు భారతీయులు. మరీముఖ్యంగా తెలుగు ప్రజలకు పాములపై భక్తి చాలా ఎక్కువ... అందుకే నాగుల పంచమి, నాగుల చవితి వంటి పర్వదినాల్లో ప్రత్యేకంగా పాములను ఆరాదిస్తుంటారు. పాములు పాలు తాగవని తెలిసినా పుట్టల్లో లీటర్ల కొద్దీ పాలు పోస్తుంటారు. అయితే పాములు పాలు ఎందుకు తాగవు...? ఒకవేళ తాగితే ఏమవుతుంది..? పాలు తగవని తెలిసి కూడా ప్రజలు పాలు ఎందుకు పోస్తారు..?.. ఇలా పాముల గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
25
పాములు పాలు ఎందుకు తాగవు..?
సైన్స్ ప్రకారం కేవలం క్షీరదాలకు (Mammals) మాత్రమే పాలు తాగే లక్షణం ఉంటుంది. కానీ పాములు సరీసృపాలు (Reptiles)... కాబట్టి ఇవి పాలు తాగవు. ఒకవేళ బలవంతంగా పాలు తాపితే పాములు చనిపోయే ఆస్కారం ఉంటుంది.
పాములు పాలు తాగితే అందులోని లాక్టోజ్ ను అరిగించుకోలేదు... దీనివల్ల చనిపోయే ప్రమాదం ఉంటుంది. పాలు తాగే సమయంలో పాముల ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది... దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చి కూడా పాము చనిపోవచ్చు. అందుకే పాములు సాధారణంగా పాలు తాగవు.
35
పాములకు పాలు పోయడం వెనకున్న స్టోరీ ఇదే..
ప్రకృతిని, జంతువులను దేవతల్లా పూజించడం భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. అందులో భాగమే పామును పూజించడం. పరమశివుడి ఆభరణంగా, విష్ణుమూర్తి శయన పాన్పుగా... ఇలా అనేక దేవతల వద్ద పాములు ఉంటాయనేది హిందువుల నమ్మకం. అందుకే వాటిని కూడా దేవతలుగా భావించి కొలుస్తారు. ఈ క్రమంలోనే దేవతల మాదిరిగానే పాములకు కూడా పవిత్రమైన పాలను నైవేధ్యంగా పెట్టే సాంప్రదాయం ఏర్పడింది… తమ భక్తిని చాటుకోవడానికి పుట్టలో పాలు సమర్పిస్తారు.
మరో కథనం ప్రకారం... ప్రాచీన కాలంలో ఇప్పటిమాదిరిగా కాంక్రీట్ ఇళ్లు లేవు... అన్ని మట్టి గోడలు, పూరి గుడిసెలే. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆనాటి ప్రజలు ఇళ్లను కూడా పొలాల వద్దే నిర్మించుకునేవారు. ఈ క్రమంలో ఇళ్లలోకి తరచూ పాములు వచ్చేవి... వీటిని చూసి ఇళ్లలోని మహిళలు భయంతో వణికిపోయేవారు. వారిలోని భయాన్ని పోగొట్టేందుకు పాములను దైవ స్వరూపంగా కొలిచే సాంప్రదాయం వచ్చింది... వాటి దగ్గరకు వెళ్లి పాలు పోయడం ప్రారంభమయ్యింది. ఇలా నాగుల చవితి, నాగుల పంచమి వంటి పండగలు వచ్చాయి... ఈ పండగల సమయంలో మహిళలే పుట్టలవద్దకు వెళ్లి భయంలేకుండా పాలు పోస్తుంటారు.
కొందరు పాములను ఆడించేవారు ప్రజల ముందు పాములతో పాలు తాగించి ఆశ్చర్యపరుస్తుంటారు. దీని వెనుక ఒక విషాదకరమైన ట్రిక్ ఉంటుంది. పాములు ఆడించేవారు ప్రదర్శనకు ముందు ఆ పాముకు ఎలాంటి అహారం, నీరు ఇవ్వరు. దీంతో విపరీతమైన దాహంతో ఉన్న పాము తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి పాలు తాగుతుంది. తన ఎదురుగా ఉన్న ద్రవ పదార్థాన్ని (పాలు) నీరు అనుకుని తాగుతుంది. ఇది భక్తి వల్ల కాదు, కేవలం దాని ప్రాణసంకటం వల్ల చేసే పని.
55
పుట్టలో పాలు పోయడం వల్ల ఏమవుతుంది?
చాలామంది పుట్టలో పాము ఉంటుందని భావించి పాలు పోస్తారు. కానీ నిజానికి పుట్టలు కట్టేది చెదలు... పాములు ఆ పుట్టలను కేవలం నివాసంగా వాడుకుంటాయి. పుట్టలో పాలు పోయడం వల్ల అక్కడ తేమ పెరిగి బ్యాక్టీరియా చేరుతుంది. పాలలో ఉండే చక్కెర వల్ల చీమలు, ఇతర కీటకాలు వచ్చి అక్కడ నివసించే పాములకు ఇబ్బంది కలిగిస్తాయి.
పాములకు పాలు పట్టడం అనేది మన సంస్కృతిలో భాగమైనప్పటికీ, శాస్త్రీయంగా అది వాటి ఆరోగ్యానికి హానికరం. పాములను రక్షించడం అంటే వాటికి పాలు పోయడం కాదు, వాటి ఆవాసాలను కాపాడటం, హింసించకుండా ఉండటం. మూఢనమ్మకాలను పక్కన పెట్టి మూగజీవాల పట్ల దయతో ఉండటమే నిజమైన భక్తి.