Motivational story: మంచి, చెడు ఈ రెండు నిజాలు కాదు కేవలం మన నమ్మకాలు మాత్రమే అంటారు. సందర్భాన్ని బట్టి ఈ రెండింటీ అర్థం మారుతుంది. మరి మీరు మంచివారా, చెడ్డవారా.? ఆ సత్యాన్ని చాటి చెప్పే ఒక మంచి మోటివేషన్ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గీత, రాము ఇద్దరూ ఐదేళ్లుగా గాఢమైన ప్రేమలో ఉంటారు. ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడతారు. భవిష్యత్తు గురించి కూడా కలిసి కలలు కంటారు. కానీ గీత ఇంట్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలవుతుంది. ఆ సమయంలో ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంబంధం వస్తుంది. నెలకు రూ.2 లక్షల జీతం. కుటుంబం కూడా బాగుంటుంది. ఇదంతా గీత రాముతో చెబుతుంది. అప్పుడు రాము ధైర్యంగా ఇలా అంటాడు “మన ప్రేమ గొప్పది. ఎవరు మనల్ని విడదీయలేరు. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడుతాను.” అంటాడు.
25
గీత మాటలతో రాము మనసు ముక్కలు
రాము మాటలు విన్న గీత ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. “నువ్వు ఇలా అంటావని అనుకోలేదు. నాకంటే ఎక్కువ సంపాదించే వాడు వస్తే నా జీవితం బాగుంటుందని అనుకుని నన్ను సంతోషంగా ఉండమంటావని అనుకున్నా. కానీ నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు,” అని అంటుంది. ఈ మాటలు రామును తీవ్రంగా బాధిస్తాయి. తన ప్రేమను గీత అర్థం చేసుకోలేదని భావించి, నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిపోతాడు. గీత ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుంటుంది.
35
రెండో ప్రేమ – మరో పరీక్ష
కొన్ని సంవత్సరాల తర్వాత రాము, రవళి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. రవళి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు. ఈసారి ఒక గ్రూప్-2 ఉద్యోగి సంబంధం వస్తుంది. గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్న రాము, ఈసారి ఇలా అంటాడు.. “నాకంటే మంచి జీవితాన్ని నువ్వు పొందాలి. ఆ సంబంధం చేసుకుని సంతోషంగా ఉండు.” ఇది విన్న రవళి కోపంతో ఉలిక్కిపడుతుంది. “నువ్వు మనిషివేనా? ప్రేమ అంటే పోరాడాలి. నన్ను వదిలేస్తావని అనుకోలేదు,” అని అంటుంది. అలా చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత ఆ గ్రూప్-2 ఉద్యోగినే పెళ్లి చేసుకుంటుంది.
కొన్నేళ్ల తర్వాత రాము ఇంట్లో చూసిన సంబంధంతో ఓ అమ్మాయిని వివాహం చేసుకొని జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒక రోజు గీతను కలుస్తాడు. “జీవితం ఎలా ఉంది?” అని అడుగుతాడు.
గీత కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటుంది.. “ అస్సలు బాగోలేదు రాము. ఆ రోజు నిన్నే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. వాడు రోజూ తాగి వచ్చి నన్ను కొడుతున్నాడు. పైగా ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. నా బిడ్డ కోసం భరించాల్సి వస్తోంది.” అని చెబుతుంది.
ఈ క్రమంలోనే తన రెండో మాజీ ప్రేమికురాలు అయిన రవళిని కలుస్తాడు. ఆమె మాత్రం చిరునవ్వుతో ఇలా అంటుంది. “చాలా బాగున్నాను రాము. నా భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. సమాజంలో గౌరవం ఉంది. ఆ రోజు నీ మాట వల్లే నాకు మంచి జరిగింది. థ్యాంక్స్.” అని అంటుంది.
55
మన విలువ ఎవరు నిర్ణయిస్తారు?
ఈ రెండు సంఘటనలు ఒక గొప్ప నిజాన్ని చెబుతున్నాయి. మన వల్ల వాళ్లకు మంచి జరిగితే మనల్ని “మంచివాళ్లు” అంటారు. మన వల్ల వాళ్లకు చెడు జరిగితే మనల్ని “చెడ్డవాళ్లు” అంటారు. కొన్నిసార్లు ముందు మంచి చేసి, తర్వాత చెడు జరిగితే కూడా మనల్ని తప్పు పడతారు. అంటే… మన మంచితనం, చెడ్డతనం మన చేతిలో ఉండదు. అది ఇతరుల అవసరాలు, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
మొత్తం మీద మన మనసు నిజాయితీగా ఉంటే చాలు. ప్రతి ఒక్కరి అభిప్రాయం ప్రకారం మనల్ని మార్చుకుంటూ పోతే, మన అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది. కాబట్టి… మనం ఎవరో మనకు తెలిసి ఉండాలి. ప్రపంచం ఇచ్చే పేర్లతో మన విలువను కొలవకూడదు.