Dogs and Bikes: బైకు మీద వెళుతున్నప్పుడు గమనించే ఉంటారు.. మీ బైకు వెనుక కుక్కలు పరిగెడుతూ ఉంటాయి. కార్ల వెనుక కూడా ఇలాగే జరుగుతుంది. అసలు కుక్కలు ఇలా బైకులు, కార్ల వెనుక ఎందుకు పరిగెడతాయి? దానికి కారణం ఉంది.
రోడ్డుపై బైక్ లేదా కారులో వెళ్తుంటే వెనుకనుంచి హఠాత్తుగా కుక్కలు పరిగెత్తడం, గట్టిగా అరవడం మీరు చూసే ఉంారు. కుక్కలు కోపంతో అలా పరిగెడుతున్నాయేమో.. దాడి చేస్తాయేమో అని ఎంతో మంది భయపడిపోయి మరింత స్పీడుగా వెళ్లిపోతుంటారు. అయితే కుక్కలు ఇలా వాహనాల వెనుక పడటానికి అసలు కారణం మనుషులపై కోపం కాదు. దీని వెనుక వాటి జీవన శైలి, వాసన పసిగట్టే నైపుణ్యం వంటి కొన్ని కారణాలు ఉన్నాయి. కుక్కలకు వాసన చూసే శక్తి చాలా ఎక్కువ. అవి వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను చాలా సులువుగా వాసనతోనే గుర్తుపట్టగలవు.
23
కారణాలు ఇవే
కుక్కలు తమ సరిహద్దులను కాపాడుకోవడానికి వాహనాల టైర్లపై మూత్ర విసర్జన చేస్తాయి. అంటే ఆ బండి తమ ప్రాంతానిదే అని తరువాత వాసనను బట్టి తెలుసుకుంటాయి. మనం వేరే వీధి లేదా ఊరి నుంచి బైకు లేదా కార్లలో వచ్చినప్పుడు ఆ టైర్లకు ఆ వాసన అలాగే ఉంటుంది కాబట్టి.. ఆ వేరే ప్రాంతంలో ఉండే కుక్కలు పసిగట్టేస్తాయి. వీధిలోకి రాగానే అక్కడి కుక్కలు ఆ టైర్లపై ఉన్న బయటి కుక్కల వాసనను పసిగట్టి, తమ సరిహద్దులోకి వేరే కుక్క ప్రవేశించిందేమో అనే భయంతో వార్నింగ్ ఇచ్చేందుకు వాహనం వెనుక పడతాయి. దీనికి తోడు వేగంగా, శబ్దంతో వెళ్లే ఏ వస్తువునైనా వెంటాడటం కుక్కలకు ఉండే సహజ స్వభావం. ఒక చోట కదలకుండా ఉండే వాహనాలను మాత్రం కుక్కలు పట్టించుకోవు. కదిలే వాహనాలను చూస్తే మాత్రం వాటికి ఉన్న వేటాడే అలవాటుతో పరిగెత్తడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా గతంలో ఏదైనా వాహనం ఢీకొట్టడం వల్ల తనకు లేదా తమ గుంపులోని ఇతర కుక్కలకు ప్రమాదం జరిగి ఉంటే ఆ చేదు జ్ఞాపకాలతో కూడా అవి వాహనాలను చూసినప్పుడు భయంతో, కోపంతో వెంటపడతాయి.
33
కుక్కలు వెంటపడితే ఏంచేయాలి?
కుక్కలు బండి వెనుక పడినప్పుడు కంగారుపడి హఠాత్తుగా వేగం పెంచేయకండి. భయంతో వాహనం బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు భయపడకుండా, వాహన వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్లడం లేదా కాసేపు బైక్ లేదా కారు ఆపేసి నిల్చోవడం మంచిది. వేగం తగ్గగానే కుక్కలు తమ వెంటాడే స్వభావాన్ని, ఆసక్తిని కోల్పోయి వెనక్కి వెళ్లిపోతాయి. వాటిని కాళ్లతో తన్నడం లేదా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకూడదు.